జిల్లాకో ప్రణాళిక ఉండాలి
సీజనల్ వ్యాధులపట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భిన్నమైన భౌగోళికాంశాల సమాహారంగా ఉన్నందున ఆయా జిల్లాలకు సంబంధించి ప్రత్యేక పరిస్థితులు, ప్రాధాన్యతలను నిర్దేశించుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే జిల్లా సమస్యలపై ప్రతిరోజూ అరగంట సేపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ‘అంటురోగాలతో ఆదిలాబాద్ జిల్లాలో మరణాలు’ అనే మాట ఇక నుంచి వినపడకూడదన్నారు. ‘‘గిరిజనులకు ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. వారికొచ్చే రోగాలకు పౌష్టికాహార లోపం కారణమనే విషయాన్ని తెలియజెప్పాలి.
సాంస్కృతిక సారథులతో స్థానిక గోండు భాషలో సాంస్కృతిక కార్యక్రమాలు రూపొం దించాలి. 40-50 బృందాలతో ప్రదర్శనలు చేపట్టి చైతన్యపరచాలి’’ అని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, వాటిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ, స్వైన్ ఫ్లూ తదితర ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. సరిపడేన్ని మందులు అందుబాటులో ఉంచాలి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కలెక్టర్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలి. వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి’’ అని చెప్పారు. జిల్లా కేంద్ర, ఏరియా దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన నిధులను పారదర్శకతతో ఖర్చు చేయాలని అన్నారు.
చక్రవడ్డీలా అభివృద్ధి...
రాష్ట్ర అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు కావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పాలనా ఫలాలు ప్రజలకు అందేలా ప్రణాళికలు రచించడమే ప్రభుత్వం బాధ్యతగా సీఎం అభివర్ణించారు. ‘‘దేవుని దయ వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువగానే తెలంగాణలో అభివృద్ధి సూచీ కనిపిస్తున్నది. కాలం ఇలాగే అనుకూలిస్తే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 వరకు బడ్జెట్ అంచనా రూ.2 లక్షల కోట్లకు చేరుతుంది. అయిదేళ్లలో సహజంగా రెట్టింపు అవుతుంది. అంటే నాలుగు లక్షల కోట్లు. అంచనాలకు మించి మరో రూ.లక్ష కోట్లు జమై 2024 నాటికే రూ.5 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ అంచనా వ్యయం చేరుకుంటుంది’’ అని వివరించారు.
హెలికాప్టర్‌లో ట్రాఫిక్ కంట్రోల్
‘‘మీరిట్లనే ఉండిపోతరని ఎందుకు అనుకుంటరు. హైదరాబాద్ ట్రాఫిక్‌ను భవిష్యత్‌లో హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షించే పరిస్థితులు వస్తాయి’’ అని కలెక్టర్లతో సీఎం వ్యాఖ్యానించారు. తాగునీరు, సాగునీరు పునరుద్ధరణే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొద్ది కాలంలోనే పూర్తవుతాయన్నారు. తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఇప్పట్నుంచే రూపకల్పన చేయాలన్నారు. ‘‘2024 కల్లా రూ.5 లక్షల కోట్లతో ఎంతో రిచ్‌గా ఉంటాం. తాగునీరు, సాగునీరు మీద యుద్ధం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు ఈబీసీ ల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్ చేసి అభివృద్ధి చేస్తాం’’ అని అన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా సదస్సులో చర్చించారు.
23 జిల్లాలతో ముసాయిదా
74 కొత్త మండలాలు.. 9 కొత్త డివిజన్లు
కలెక్టర్ల వర్క్‌షాప్‌లో ఇదే నమూనాపై చర్చ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావటంతో ఏయే ప్రాంతాలు కొత్త జిల్లా కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయన్న ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికలతో పాటు భూపరిపాలన విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసే లా ముసాయిదాను రూపొందించింది. కొత్త జిల్లాలు, వాటికి సంబంధించిన జనాభా, విస్తీర్ణంతోపాటు ఎన్ని మండలాలు వాటి పరిధిలోకి వస్తాయనే వివరాలను అందులో పొందుపరిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 459 మండలాలకు అదనంగా 74 కొత్త మండలాలను, 44 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 9 డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక కసరత్తు జరిగింది. ఈ నమూనా ఆధారంగానే రెండు రోజుల పాటు కలెక్టర్ల వర్క్‌షాప్‌లో చర్చలు జరిగాయి.