సామాజిక చిత్రం
అదో పల్లెటూరు. అంతా గోలగోలగా ఉంది. ఏంటని చూస్తే... అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి. రెండు పుంజులు హోరాహోరీగా పోటీపడుతున్న దృశ్యం మదిలో ముద్రితమైంది. అదే కాన్వాస్‌పై ఓ చక్కని చిత్రంగా మారింది. ఇలాంటివెన్నో జీవన చిత్రాలు ప్రముఖ చిత్రకారుడు దేబబ్రతా బిశ్వాస్ కుంచెతో రంగులద్దుకున్నాయి. జూబ్లీహిల్స్ బియాండ్ కాఫీలో తన అపురూప పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేసిన సందర్భంగా బిస్వాస్‌ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది...
ఆర్ట్ అంటే ప్రాణం. మధ్య తరగతి కుటుంబం. అమ్మానాన్నలతో వాళ్ల సొంత గ్రామాలకు వెళుతుండేవాడిని. అలా పల్లెటూరు జీవనాన్ని దగ్గరి నుంచి చూశా. పంట పొలాలు, కల్మషం లేని మనుషులు, ఆహ్లాదకరమైన వాతావరణం... ఆ గ్రామాలంటే నాకెంతో ఇష్టం. మాది జంషెడ్‌పూర్. ఇంటర్ వరకు అక్కడే చదివా. పాఠశాల స్థాయి నుంచే జంతువులు, ప్రకృతి బొమ్ములు వేస్తుండే వాడిని. నా ప్రతిభ గుర్తించి పేరెంట్స్ ప్రోత్సహించారు. ఎక్కడ పెయింటింగ్ పోటీలు జరిగినా తీసుకెళ్లేవారు. వారి ప్రశంసలే నా కుంచెకు మరింత పదును పెట్టాయి.
లెక్కలేనన్ని బహుమతులు తెచ్చి పెట్టాయి. ఇదే జోష్‌తో జంషెడ్‌పూర్ ఠాగూర్ సొసైటీలో ఆర్ట్స్‌లో డిప్లమో చేశా. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజిక్ బోర్డు నుంచి బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ చేశా. పీజీ పూర్తయ్యేసరికి నేను ఎంచుకున్న కళలో లోతు చూశా. ఈ సమయంలోనే కళాకారులకు అరుదుగా లభించే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యా.
నా చిత్రాలతో వ్యక్తిగత ప్రదర్శనలు చెయ్యడం సొంతూరు (1997)లోనే మొదలైంది. ఇప్పటివరకు పదులకు పైగా వివిధ నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించా. నా ఆర్ట్‌కు సబ్జెక్ట్ మాత్రం నా పరిసరాల్లో జరిగే అంశాలే. ప్రకృతి, జీవన గమనం వంటివి ప్రతి బొమ్మలో ప్రతిబింబిస్తాయి. సమాజాన్ని ప్రభావితం చేయగలిగి, ఉపయోగపడేదే నిజమైన కళ. మాయమవుతున్న పచ్చని పైర్లు, విచ్ఛిన్నమవుతున్న సంస్కృతి, పోటెత్తుతున్న కాలుష్యం... ఇలా సామాజిక, ప్రకృతి చిత్రాలే నావి. అక్రాలిక్, ఆయిల్, వాటర్ కలర్‌సతో బొమ్మలు వేస్తా. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఈ సిటీకి వచ్చిన నన్ను... మంచి ఆర్టిస్టుగా ఆదరించింది. భవిష్యత్‌లోనూ ఈ మహానగరంతో బంధం కొనసాగిస్తా.
...::: వీఎస్