అమెరికన్ కాన్సులేట్ వద్ద ఆందోళన
బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద వామపక్షాలు, విద్యార్థి సంఘాలు భారీగా ధర్నా చేశాయి. అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేకు జరిగిన అవమానానికి నిరసనగా వీళ్లంతా అక్కడ ధర్నా చేసి, కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, అలా జరగకుండా ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటుచేశారు. కిలోమీటరు దూరం వరకు బారికేడ్లు ఏర్పాటుచేసి చివరకు మీడియాను కూడా అక్కడకు అనుమతించలేదు. పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు.
చుట్టుపక్కల ఉన్న మిగిలిన కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని కూడా అటువైపు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వామపక్షాల కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద ఎవరినీ అనుమతించబోమంటూ బోర్డు కూడా పెట్టారు. అయినా విద్యార్థులు ఎలాగోలా సమీపం వరకు వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేసి, తీవ్ర స్థాయిలో నినదించారు. ఆందోళనకారులకు మొదటి బ్యారికేడ్ దాటి కార్యాలయం వదరకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు.