పల్లెబాట
దసరా కోసం సొంత ఊళ్లకు తరలిన నగరం
వారం రోజుల్లో 10 లక్షల మంది
కిక్కిరిసిన రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు
సొంత వాహనాల్లోనూ భారీగా వెళ్లిన జనం
సిటీబ్యూరో: మహా నగరం పల్లెబాట పట్టింది. దసరా ఉత్సవాల కోసం సొంత ఊళ్లకు తరలివెళ్లింది. బస్సులు, రైళ్లు, ప్రైవేట్ రవాణా వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో జనం భారీ సంఖ్యలో వెళ్లారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఏపీ కంటే తెలంగాణ జిల్లాలకు భారీ సంఖ్యలో జనం పయనమయ్యారు. బుధవారం ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా వివిధ మార్గాల్లో సొంత ఊళ్లకు వెళ్లారు. ఈసారి విద్యాసంస్థలకు ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో సొంత ఊళ్లలో గడిపేందుకు నగర వాసులు అధిక సంఖ్యలో పల్లె‘టూర్’కు సాగారు. ఈ వారం రోజుల్లో సుమారు 10 లక్షల మంది స్వగ్రామాలకు కదిలారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ఈ సంవత్సరం దసరా సందర్భంగా 117 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి విశాఖ, కాకినాడ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, నిజామాబాద్, వరంగల్ వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడాయి. మరోవైపు ఆర్టీసీ 3,855 ప్రత్యేక బస్సులను నడిపింది. హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, కర్నూలు, కడప, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బుధవారం ఒక్కరోజే సుమారు 850 బస్సులను ఏర్పాటు చేశారు.
అదనపు సర్వీసుల్లో...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి రోజూ సుమారు 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100 ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా ఈ వారం రోజుల్లో మరో 15 సర్వీసులను వివిధ ప్రాంతాలకు అదన ంగా నడిపారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో నిత్యం బయలుదేరే 2.5 లక్షల మంది ప్రయాణికులతో పాటు ఈ వారం రోజుల్లో మరో 4 లక్షల మంది తరలి వెళ్లారు.
జూబ్లీ, మహాత్మాగాంధీ, దిల్‌సుఖ్‌న గర్, ఎల్‌బీనగర్, కాచిగూడ, ఉప్పల్, ఏఎస్‌రావు నగర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే రెగ్యులర్ బస్సులతో పాటు దసరా కోసం ఆర్టీసీ 3,855 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వీటిలో సుమారు 1500 ఏపీ వైపు .. మిగతావి తెలంగాణ జిల్లాలకు నడిచాయి. వివిధ ప్రాంతాలకు బయలుదే రిన మరో 1000 ప్రైవేట్ బస్సుల్లోనూ ప్రయాణికుల రద్దీ బాగా కనిపించింది. మొత్తంగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లారు.
ఇక సొంత వాహనాలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, టాటాఏసీల వంటి రవాణా వాహనాల్లోనూ సుమారు 2 లక్షల మంది పల్లెబాట పట్టారు. యధావిధిగా దోపిడీ పర్వం {పయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 200 కిలోమీటర్లకు పైగా వెళ్లే బస్సుల్లో ఆర్టీసీ చార్జీలో 50 శాతం అదనపు దోపిడీకి పాల్పడింది.
{పైవేట్ బస్సులు రెట్టింపు చార్జీలతో దారి దోపిడీని కొనసాగించాయి. విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల కు ఏసీ బస్సు చార్జీలు రూ.650 నుంచి రూ.700 వరకు ఉంటే దసరా రద్దీ దృష్ట్యా రూ.1300 నుంచి రూ.1500కు పెంచారు. సాధారణ రోజుల్లో విశాఖకు రూ.950 కాగా ప్రస్తుతం రూ.1800 నుంచి రూ.2000 వరకు వసూలు చేసి దోచుకున్నారు.
ఇతర ప్రైవేట్ వాహనాలు సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశాయి. ఒకవైపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే ఈ దోపిడీ పర్వంలో తానేమీ తీసిపోవడం లేదన్నట్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ చార్జీలను రూ.10 నుంచి రూ.20 కి పెంచింది. ఈ నెల 17 నుంచి 26 వరకు దీన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రతి రోజు సుమారు 25,000 మంది ఈ అదనపు భారాన్ని మోయవలసి రావడం గమనార్హం.
రహదారులు ఖాళీ
దసరా సందర్భంగా అధిక శాతం ప్రజలు పల్లెబాట పట్టడంతో మహా నగరంలోని వివిధ రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే వివిధ ప్రధాన రోడ్లు బుధవారం ఖాళీగా కనిపించాయి. వాహనాల రద్దీ కూడా తక్కువగా ఉంది.