టార్గెట్ 2050
- ప్రపంచస్థాయి నగరానికి ప్రణాళికలు
- తాగునీటి సరఫరాకి ప్రాధాన్యం
- నిధుల గురించి ఫికరొద్దు !
- పది రోజుల్లో నివేదిక ఇవ్వండి
- ‘గ్రేటర్’పై సమీక్షలో కేసీఆర్
సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు స్లమ్ ఫ్రీ సిటీ (మురికివాడలు లేని నగరం).. మరోవైపు అంతర్జాతీయస్థాయి నగరం.. ఈ రెండింటినీ అమలు చేయాలనుకుంటున్న నూతన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో గ్రేటర్ పరిధిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2050 నాటికి గ్రేటర్ జనాభాను దృష్టిలో ఉంచుకొని అందుకనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అందుకు ఎన్ని నిధులు అవసరమైనా ఫర్వాలేదన్నారు.
మెరుగైన ప్రజాసదుపాయలకు.. ప్రపంచస్థాయి నగరంగా విరాజిల్లేందుకు చేయాల్సిన పనులపై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సూచించారు. పదిరోజుల్లో తగు నివేదికను సిద్ధం చేయాలన్నారు. కేసీఆర్ అభిమతం మేరకు గ్రేటర్ నగరంలో దిగువ పనులు కార్యరూపం దాల్చనున్నాయి.టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలోని హామీకి అనుగుణంగా రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, కిచె న్, బాత్‌రూమ్‌లతో కూడిన ఇళ్లను పేదల కోసం నిర్మించనున్నారు. నగరంలో ప్రజలు ముందుకొచ్చే ప్రాం తాల్లో పైలట్‌ప్రాజెక్టుగా వీటిని వెంటనే చేపట్టనున్నారు. అందుకుగాను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్పొరేటర్ల సలహాల స్వీకరణ సైతం ప్రారంభించారు.
- నగరంలో తరచూ ఎదురవుతున్న రహదారుల సమస్యలు.. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చేసే చర్యలు వెంటనే చేపట్టనున్నారు. చెత్త, డెబ్రిస్ నిర్వహణ పనుల్ని కూడా త్వరితంగా చేపట్టనున్నారు. వర్షాకాలంలో తరచూ భవనాలు కూలిపోతుండటాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ దాదాపు నాలుగేళ్ల క్రితం నారాయణగూడలో భవనం కూల డాన్ని గుర్తు చేశారు. రహదారులు, నీటినిల్వ సమస్యల పరిష్కారానికి అవసరమైతే అంతర్జాతీయ కన్సల్టెంట్లను సంప్రదించాల్సిందిగా సూచించారు. అధికారులు ఆ దిశగా అడుగు వేయనున్నారు.
- మౌలిక సదుపాయాల కల్పన.. ట్రా‘ఫికర్’ నుంచి విముక్తి.. 24 గంటల పాటు విద్యుత్, నీటిసరఫరాపై శ్రద్ధ చూపనున్నారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్‌లో 78 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం 94 లక్షలకు చేరారు. త్వరలో అమలయ్యే ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల దాదాపు మరో కోటిమంది దాకా నగరానికి వచ్చే అవకాశమున్నందున 2050 అవసరాల కనుగుణంగా సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం సూచించారు.
ఐటీ కంపెనీలను ఆకట్టుకోవాలంటే మెరుగైన సదుపాయాలు ఉండాల్సి ఉన్నందున ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా సూచించారు. హైటెక్‌సిటీ అయినప్పటికీ సీవరేజి లైన్లు లేకపోవడాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం పనితీరు, డీజిల్ చౌర్యం వంటి అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
- మూసీ ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉండేదంటూ.. ప్రస్తుతానికి చెత్తాచెదారాలు లేకుండాైనె నా తగు చర్యలు తీసుకోవాలనడంతో అధికారులు అందుకు సిద్ధమవుతున్నారు.
- సమావేశంలో మంత్రులు, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ , హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, జలమండలి ఎండీ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ప్రాజెక్టులకునిధుల కొరత రానీయం
నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాల పూర్తికి నిధుల కొరత రానీయబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గ్రేటర్ తాగునీటి అవసరాలు 2050 సంవత్సరం నాటికి ఎలా ఉండబోతాయో ఇప్పటి నుంచే సమగ్ర అంచనాలు సిద్ధం చేసుకోవాలని, అందుకు పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల అంచనాలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో అంతరాయంలేకుండా చూసేందుకు అధికారులు, సిబ్బంది సదా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.