గెలిచాకే వెళదాం... అప్పటిదాకా ‘నో’
ఎంపీ లేదా ఎమ్మెల్యే అయ్యే వరకూ చట్టసభల ప్రాంగణంలోకి అడుగుపెట్టను అని భీషణ ప్రతిజ్ఞచేశారు ఓ టీడీపీ నేత. జన్మతహా గుంటూరు జిల్లాకు చెందిన ఈ నేత పోలీస్ అధికారిగా కృష్ణా జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి టీడీపీలో చేరారు. ఆ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా, ఆ తరువాత ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నపుడు చివరి నిమిషంలో చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతి లోక్‌సభ సీటు కేటాయించారు. ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా ఆయన ఓడిపోయారు.
ఎంతోకాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న ఆయన్ను పార్టీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ఏపీ గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌గా నియమించారు. బుగ్గ కారు కేటాయించారు. దీంతో ఆయన అనుచరులు సార్ మనం కూడా అసెంబ్లీకి వెళదాం, మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్లు ఎమ్మెల్యేలు కాకపోయినా అసెంబ్లీకి వెళుతున్నారు కాబట్టి మనం కూడా అలా వెళ్లొద్దామని అడిగితే ససేమిరా అనటంతో పాటు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయ్యే వరకూ అటు పార్లమెంటు లేదా ఇటు అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదు అని కరాఖండిగా చెప్పి అసెంబ్లీ చూడాలన్న అనుచరుల ఆశపై నీళ్లు చల్లుతున్నారట.