తెలుగు రాష్ట్రాల నుంచి 15 శాతం మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–2017లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10లో మెరవకపోయినా టాప్–100 ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 30 మంది వరకు ఉన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసినవారిలో 15 శాతానికిపైగా అర్హత సాధించారు. ఇక పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల కుర్రోడు నవదీప్‌సింగ్ నీట్‌లో దుమ్మురేపాడు. ముక్తసర్‌కు చెందిన ఈ విద్యార్థి 720 మార్కులకుగాను 99.9 పర్సంటైల్‌తో 697 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన అర్చిత్ గుప్తా రెండు, అదే రాష్ట్రానికి చెందిన మనీశ్ ముల్చందానీ మూడో ర్యాంకు సాధించారు. అర్చిత్ గుప్తా ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలోనూ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. మే 7న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) శుక్రవారం వెల్లడించింది. మొత్తంగా పరీక్షలో అర్హత సాధించిన వారిలో బాలికలే ముందంజలో ఉన్నారు. అమ్మాయిలు 3,45,313 మంది, అబ్బాయిలు 2,66,221 మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా పరీక్షకు 11,38,890 మంది విద్యార్థులు హాజరు కాగా.. 6,11,539 మంది అర్హత సాధించారు. 9.13 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనూ.. 1.20 లక్షల మంది విద్యార్థులు హిందీ మీడియంలో నీట్ పరీక్ష రాశారు. భారత వైద్య మండలి(ఎంసీఐ) అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో 470 మెడికల్ కాలేజీల్లో సుమారు 65,170 ఎంబీబీఎస్ సీట్లు, 308 డెంటల్ కాలేజీల్లో సుమారు 25,730 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈసారి నీట్ పరీక్షలో ఐదుగురు ట్రాన్స్‌జెండర్స్ (లింగమార్పిడి చేయించుకున్నవారు) అర్హత సాధించారు. పరీక్షకు ఎనిమిది మంది హాజరుకాగా.. వారిలో ఐదుగురు అర్హత పొందారు. గతేడాది తొమ్మిది మంది హాజరైతే.. ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్ అర్హత సాధించారు.
రాష్ట్ర ర్యాంకులు వచ్చాకే కన్వీనర్ కోటాలో ప్రవేశాలు
ప్రస్తుతం సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి ర్యాంకు లను మాత్రమే ప్రకటించింది. తెలంగాణ, ఏపీ లకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకులు ఇచ్చాకే ఇరు రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలను చేపట్టనున్నారు. త్వరలోనే ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రక టించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 371 డి పరిధిలో ఉన్నందున ఇక్కడి కన్వీనర్ కోటా సీట్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు మాత్రమే చేరే వీలుంది. ఇతర రాష్ట్ర విద్యార్థులను కన్వీనర్ కోటాలో తీసుకోరు.
తెలంగాణ నుంచి టాప్–100లో 13 మంది
నీట్‌కు తెలంగాణ నుంచి 43,200 మంది, ఏపీ నుంచి 66 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15 శాతానికిపైగా విద్యార్థులు ర్యాంకులను సాధించారు. టాప్–100 ర్యాంకుల్లో 30 మంది వరకు ర్యాంకులను సాధించినట్టు విద్యాసంస్థలు అంచనా వేస్తున్నాయి. టాప్–100లో తెలంగాణకు చెందినవారు 13 మంది ఉన్నారు.
టాప్ ర్యాంక్ ఊహించలేదు
నీట్‌లో అర్హత సాధిస్తానని ఊహించా. అయితే ఫస్ట్ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తా. మా నాన్న ప్రభుత్వ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.
– నవదీప్, ఫస్ట్ ర్యాంకర్
ఎయిమ్స్‌లో చదువుతా
వైద్య వృత్తి అంటే నాకెంతో గౌరవం. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాను. ప్రతి రోజూ 14 గంటల పాటు కష్టపడి చదివాను. తొలిసారిగా నీట్ రాశాను. 12వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతాను.
– అర్నవ్ త్రినాథ్
ఉస్మానియాలో చేరుతా
ఎనిమిదో తరగతి నుంచే డాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆ మేరకు కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే 98వ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తాను. నాన్న విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. – సాయి సౌగంద్
కార్డియాలజిస్టు అవుతా
మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న చిరు వ్యాపారి. గతేడాది కూడా మెడికల్ ఎంట్రన్స్ రాశాను. ర్యాంకు వచ్చింది కానీ వయసు తక్కువగా ఉండటంతో చేరలేకపోయాను. దీంతో ఈ ఏడాది కూడా రాశాను. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 24వ ర్యాంకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎయిమ్స్‌లో చదవాలని ఉంది. భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ కావాలని కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు ప్రత్యేక ప్రణాళికతో చదవటం వల్లే ర్యాంకు లభించింది.
– ఎం.దీపిక
ఎయిమ్స్‌లో చేరుతా
అమ్మా, నాన్న ఇద్దరూ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆ మేరకు కష్టపడి చదివాను. టెన్త్‌లో 9.8 శాతం మార్కులు, ఇంటర్‌లో 986 మార్కులు సాధించాను. ఏపీ ఎంసెట్‌లో 4వ ర్యాంకు, టీఎస్‌ఎంసెట్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్‌లో చదవాలని అనుకుంటున్నా. కార్డియాలజీ పూర్తి చేసి, భవిష్యత్తులో హృద్రోగ చిన్నారులకు చికిత్సలు అందిస్తా.
– ఎస్.నిఖిల్ చౌదరి
న్యూరో ఫిజీషియన్ అవుతా
వైద్య కోర్సులో మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి, అధ్యాపకుల సహకారం వల్లే ఈ ర్యాంకు సాధించాను. టెన్త్‌లో 10/10 మార్కులు సాధించాను. ఇంటర్‌లో 978 మార్కులు వచ్చాయి. అమ్మానాన్నలు ఇద్దరూ డాక్టర్లే కావడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు కూడా డాక్టర్ కావాలనే కోరిక ఉంది. ఎయిమ్స్‌లో కానీ, సీఎంసీలో కానీ చేరుతాను. భవిష్యత్తులో న్యూరోఫిజీషియన్‌గా సేవలు అందిస్తా.
– ప్రీతి
నీట్ కటాఫ్ 131
సాక్షి, హైదరాబాద్: నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కటాఫ్ మార్కును నిర్ధారించారు. మొత్తం 720 మార్కులకు గాను జనరల్ కేటగిరీలో అత్యధిక మార్కులు 697. 50 శాతం పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 131 అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి విశ్లేషించారు. గతేడాది కటాఫ్ మార్కు 140గా ఉందన్నారు. ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో 40 పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 107గా నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు. ఓబీసీల్లో 107 మార్కులుగా ఉండొచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఓసీ కేటగిరీలో 5.43 లక్షలు, ఓబీసీలో 47,382, ఎస్సీలో 14,599, ఎస్టీలో 6,018 మంది నీట్‌లో అర్హత సాధించారని వెల్లడించారు. తాము నోటిఫికేషన్ జారీ చేశాక దరఖాస్తు చేసుకున్న వారి ఆధారంగా రాష్ట్రస్థాయి ర్యాంకులు ఖరారవుతాయన్నారు. మరో 15 రోజుల్లోగా నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందన్నారు.
ఈసారి కామన్ కౌన్సెలింగ్
ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ కలపి ప్రభుత్వమే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇందుకు కాళోజీ వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సహజంగా నోటిఫికేషన్ విడుదలకు ముందు ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ తర్వాతే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.