ఎక్కువే ఇస్తున్నాం
సబ్‌ప్లాన్‌ను మించి నిధులు ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్
► ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
► వారికి అన్నివిధాలా సహకారం అందిస్తాం
► హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెరగాలన్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఖర్చు చేసిన వివరాలు, విషయాలు వారికి తెలియకపోతే ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందనే భావన కలిగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీల పట్ల మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, అభివృద్ధి, సంక్షేమ చర్యలపై సీఎం సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, సందీప్ సుల్తానియా, కరుణాకర్, ప్రవీణ్ కుమార్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు విషయంలో ప్రతీనెలా అధికారులు సమీక్ష జరపాలి. మూడు నెలలకోసారి మంత్రులు సమావేశాలు నిర్వహించాలి. అరు నెలలకోసారి ముఖ్యమంత్రే స్వయంగా సమీక్ష నిర్వహించాలి. సబ్‌ప్లాన్ ప్రకారం కేటాయించిన నిధులే కాకుండా.. ఆయా వర్గాలకు ప్రభుత్వం ఎక్కువే ఖర్చు చేస్తోంది. ఇదే ఒరవడి ఇక ముందు కూడా కొనసాగాలి. వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్.. ఇలా ఆర్థిక లబ్ధి కల్పించే పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీని అందిస్తోంది. కల్యాణలక్ష్మి, దళితులకు భూపంపిణీ అమల్లో ఉంది. ఇతర పథకాల్లోనూ వారికే గరిష్ట లబ్ధి చేకూరుతోంది. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులోనూ కొనసాగించాలి’’అని సీఎం చెప్పారు.
మెస్ ఛార్జీలు పెరగాలి
‘‘రాష్ట్రంలో హాస్టళ్ల పరిస్థితి మారాలి. విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు అవసరమైనంత పెరగాలి. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఎస్సీ, ఎస్టీల్లో పరిమితి లేకుండా ఎంత మందికి అవసరమైతే అంత మందికి అందించాలి’’అని సీఎం అధికారులకు సూచించారు.
ఆ భూములు వినియోగంలోకి తేవాలి
ఎస్సీ, ఎస్టీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములతో పాటు సొంత భూములు ఉపయోగంలోకి తేవాలని సీఎం పేర్కొన్నారు. వారు వ్యవసాయం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని, మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు.
కేంద్రం ఆ పద్దులను తీసేసింది..
‘‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేసింది. ప్లాన్, నాన్ ప్లాన్ పద్దులు తీసేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు పోను మిగతా వ్యయమంతా ఒకే పద్దు కింద చూపించేలా మార్గదర్శకాలు రూపొందించింది. వాటినే అనుసరించాలి. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించాలి’’అని ఆదేశించారు.