సీ-డామ్.. నేరగాళ్లకు కళ్లెం | The start of a special center in Cyberabad | Sakshi
Sakshi News home page

సీ-డామ్.. నేరగాళ్లకు కళ్లెం

Published Tue, Apr 19 2016 12:24 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

సీ-డామ్.. నేరగాళ్లకు కళ్లెం - Sakshi

సీ-డామ్.. నేరగాళ్లకు కళ్లెం

 సైబరాబాద్‌లో ప్రత్యేక కేంద్రం ప్రారంభం  
సాంకేతిక ఆధారాల సేకరణ, విశ్లేషణకు మార్గం యాప్ట్ ఫైవ్

 

 సిటీబ్యూరో: సంచలనాత్మక నేరాలు, సైబర్ నేరాల కీలక దర్యాప్తుకు ఉపకరించే ‘క్రైమ్ డాటా అనాల సిస్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం’ (సీ-డామ్) సైబరాబాద్ కమిషనరేట్‌లో  అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను అధికారులుఇజ్రాయిల్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆయా సాఫ్ట్‌వేర్స్, వాటివల్ల ఉపయోగా లపై ప్రత్యేక కథనం.

 

యాప్ట్ ఫైవ్
సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌లో నేరగాళ్లు, అనుమానితుల ముఖాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. నిందితుడు వాడిన బైక్ నంబర్ సరిగా రికార్డు కాకపోవచ్చు. ‘యాప్ట్ ఫైవ్’ సాఫ్ట్‌వేర్ అలాంటి వీడియోలను స్పష్టంగా మారుస్తుంది. దర్యాప్తునకు అవసరమైన కీలక ఆధారాలను అందిస్తుంది. వివిధ ఫార్మాట్‌ల్లో ఉండే వీడియోలు, ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఆ దృశ్యాలను స్పష్టంగా చూసేలా చేయవచ్చు.

 

బెల్కా సాఫ్ట్
సామాజిక మాధ్యమాలు, ఇంటర్‌నెట్, ఈ-మెయిల్స్.. వీటిలో నేరగాళ్లు దేన్ని వినియోగించినా ఈ సాఫ్ట్‌వేర్ విడిచిపెట్టదు. ఆయా ఇంటర్‌నెట్, యాప్స్ నుంచి పోలీసులు, దర్యాప్తు అధికారులకు కావాల్సిన సమాచారాన్ని ‘బెల్కా సాఫ్ట్’ సంగ్రహించి అందిస్తుంది. నేరగాళ్లు దాన్ని డిలీట్ చేసినా.. రిట్రీవ్ చేసి అందించడం దీని ప్రత్యేకత.

 

‘ఫ్రెడ్’తో పని స్మార్ట్
‘ఫోరెన్సిక్ రికవరీ ఆఫ్ ఏవిడెన్సీ డివైజ్’ (ఫ్రెడ్)గా పిలిచే దీన్ని మినీ సూపర్ కంప్యూటర్‌గా చెప్పొచ్చు. దీన్ని మిగతా ఫోరెన్సిక్ సాఫ్ట్‌వేర్ టూల్స్‌కు అనుసంధానం చేస్తారు. ఆధారాల సేకరణలో రికవరీ డిజైన్‌గా పనిచేస్తుంది. ఓ నేరానికి సబంధించిన ఆధారాల కోసం హార్డ్‌డిస్క్‌లోని అంశాలను కాపీ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే.. అందులోని వివరాల్లో మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి కొన్ని గంటల సమయమూ పడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తే వివరాల్లో మార్పు లేకుండా గరిష్టంగా గంటలోనే పని పూర్తి చేయవచ్చు.

 

యూఎఫ్‌ఈడీ టచ్
నేరానికి వినియోగించిన, దానికి సబంధించిన డేటాలను నేరగాళ్లు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి డిలీట్ చేసేస్తారు. అయితే ఆ కేసులు కొలిక్కి రావాలన్నా, న్యాయస్థానంలో నిందితుల్ని దోషులుగా నిరూపించాలన్నా ఆ ఆధారాలు కీలకం. ‘యూఎఫ్‌ఈడీ’ టచ్ సాఫ్ట్‌వేర్‌తో డిలీటైన సమాచారాన్ని తిరిగి రాబట్టవచ్చు. అలా వచ్చిన డాటాను ఈ సాఫ్ట్‌వేర్ విశ్లేషిస్తుంది.

 

రీడ్/రైట్ బ్లాక్
ఈ హార్డ్‌వేర్ ద్వారా ఘటనాస్థలిలోనే అనుమానాస్పద హార్డ్‌డిస్క్‌లోని సమాచారం పొందేందుకు ఉపయోగపడుతుంది. సీజ్ చేసిన డివైజ్‌ను ఉన్నది ఉన్నట్టుగా 24 గంటల్లో కోర్టుకు సమర్పించాలి. అందులో ఏముందో చూడలేం. ఏ డివైజ్ అయినా ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు, తేదీ, టైం కూడా నమోదు అవుతుంది. అరెస్టు చేసిన తరవాత లాగిన్ అయితే సాక్ష్యం కింద పనికిరాదు. సీజ్‌చేసిన తరవాత లాగిన్ అయితే సిస్టమ్‌లో మార్పులుంటాయి. అలా కాకుండా ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వివరాలను ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేయవచ్చు. దీనివల్ల కొత్త వివరాలు పొందుపరచడం, పాతవి తొలగించడం సాధ్యం కాదు.

 

 సిమ్ కార్డు సీజర్
దీని సాయంతో సెల్‌ఫోన్ సిమ్‌కార్డుల్లో డిలీట్ అయిన సమాచారాన్ని సైతం రాబట్టవచ్చు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా కేసుల్ని త్వరితగతిన కొలిక్కి తీసుకురావచ్చు. పోలీసులకు తలనొప్పిగా మారిన చైనా తయారీ సెల్‌ఫోన్ల నుంచి డిలీట్ అయిన సమాచారం రాబట్టడానికి ‘కనెక్ట్ క్యూ 3.0’ సాఫ్ట్‌వేర్‌ను ఖరీదు చేశారు.

 

పాస్‌వర్డ్ టూల్ కిట్
ఈ టూల్ ద్వారా కంప్యూటర్, సెల్‌ఫోన్లను లాక్ చేయడానికి దుండగులు వాడిన ఎలాంటి సంక్లిష్ట అంశాన్నైనా పోలీసులు బ్రేక్ చేయగలరు. సైబర్ నేరాలకు పాల్పడే వారికి చెందిన ఈ వివరాలనూ తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement