ఇంట్లో ఉన్న వారంతా శుభకార్యానికి హాజరుకాగా దగ్గరి బంధువే చోరీకి పాల్పడ్డ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎన్.రామారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్మాయిల్ నగర్‌కు చెందిన సయ్యద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3వ తేదీన రాత్రి జహంగీరాబాద్‌లోని కూతురు ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లాడు.
కాగా, ఈ విషయాన్ని గమనించిన ఇబ్రహీం అల్లుడి తమ్ముడు తాజుద్దీన్(27) దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఇంటి తాళం పగులకొట్టి, అల్మారాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.21,300 నగదు చోరీ చేశాడు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లి, బంధువులతో కలిసి పోయాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లి చూసిన ఇబ్రహీం దొంగతనం జరిగిందని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తాజుద్దీనే నిందితుడని తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు స్వాదీనం చేసుకున్నారు. కాగా, ఇబ్రహీం కూడా తన ఇంట్లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.2 లక్షల నగదు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అది వట్టిదేనని తేల్చటం కొసమెరుపు.