తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో తాము పాస్ కాలేదన్న మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో తాము పాస్ కాలేదన్న మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న చిన్న కారణంతో బలవన్మరణానికి యత్నించారు. ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో విద్యార్థిని గొంతు కోసుకొని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది.
శృతి ఆత్మహత్య!
భువనగిరి అర్భన్ (నల్లగొండ): పరీక్ష ఫెయిలవ్వడంతో తార్నాకలోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శృతి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరికి చెందిన వీ కృష్ణ కూతురు శృతి నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఓ సబ్జెక్టు ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శృతి మధ్యాహ్నం భువనరిగిలోని తన ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ బలవన్మరణంతో తల్లిదండ్రుల గుండె చెదిరింది. బోరున విలపిస్తున్న వారిని చూసి స్థానికులూ కంట తడి పెట్టారు.
గొంతు కోసుకున్న విద్యార్థిని
లాలాగూడ (హైదరాబాద్‌సిటీ): ఇంటర్ పరీక్ష తప్పాననే బాధతో ఇంటర్ విద్యార్థిని ఒకరు గొంతుకోసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తీవ్ర రక్తస్రావమైన విద్యార్థినిని గాంధీకి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.