కష్టాల్లో వీణ-వాణి పర్యవేక్షణ!
- స్టేట్‌హోంకు తరలించే అవకాశముందంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ-వాణిల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. లండన్ పంపించి ఆపరేషన్ చేసే కథ కంచికి చేరింది. ఎయిమ్స్ వైద్యులూ చేతులెత్తేశారు. యుక్త వయస్సు వస్తోంది ఇక మేము ఉంచుకోలేమంటూ నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు..తల్లిదండ్రులేమో ఆ బిడ్డలను తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీణ వాణిల పర్యవేక్షణ, వారికి వైద్యసేవలు ప్రశ్నార్థకంగా మారాయి. వీణ-వాణిల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడాలని ప్రభుత్వం నీలోఫర్ వైద్యులకిచ్చిన ఆదేశాల మేరకు ఆరు రోజుల క్రితం కవలల తండ్రిని పిలిపించారు. కవలలిద్దరినీ తీసుకెళతానని, అయితే దీనికోసం ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం వచ్చేలా చూడాలని కోరారు.
ఆ తర్వాత నీలోఫర్ వైద్యులు, వీణ-వాణి తండ్రి లేఖ రాయడం మొదలెట్టారు. లేఖ రాసేక్రమంలో సగం పూర్తయ్యాక వీణ-వాణిల తండ్రికి ఫోన్ వచ్చింది. అనంతరం ఆయన లేఖ మధ్యలోనే ఆపేశారు. ఎందుకూ అని వైద్యులు ప్రశ్నించగా, ఐదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళతానని చెప్పారు. ఇప్పుడు ఏడు రోజులైనా తండ్రి ఫోన్ కూడా తీయడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో నీలోఫర్ వైద్య బృందం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీలోఫర్ ఆస్పత్రి ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే వైద్యమందించే ఆస్పత్రి అని, వీణ-వాణిలకు 13 సంవత్సరాల వయసు వచ్చిందని, ఇక తాము ఇక్కడ వారి పర్యవేక్షణ చూడలేమని చెబుతున్నారు. ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వైద్యబృందం సర్కారుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు తీసుకెళ్లడానికి నిరాకరిస్తే వారిని స్టేట్‌హోంకు తరలించాలనే ఆలోచన సర్కారుకు ఉన్నట్టు తెలుస్తోంది.