
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 1న సంగా రెడ్డిలో నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా గర్జన’ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది
► ‘తెలంగాణ ప్రజాగర్జన’ సభ ఏర్పాట్లు పరిశీలించిన ఉత్తమ్
► జన సమీకరణ, ఏర్పాట్లపై జిల్లా నేతలతో సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 1న సంగా రెడ్డిలో నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా గర్జన’ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్న ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు, అదేస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కృషి చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, రైతులకు వ్యవసాయ పనుల ఒత్తిడి ఉన్న ఈ సమయంలో సభను నిర్వహించొద్దని అధి ష్టానానికి పలువురు నేతలు విన్నవించినా రాహుల్ పట్టించుకోకుండా సభకు హాజరవు తున్నారని ఓ టీపీసీసీ నేత వెల్లడించారు.
ఈ సభను భారీగా నిర్వహించి సత్తా చూపించాలని ఉత్తమ్ సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతు న్నా యి. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో ఉత్తమ్ సమావేశమై జనసమీకరణ ఏర్పాట్లపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా నుంచి లక్షమంది వరకు జనాన్ని సమీకరిం చాలని స్థానిక నేతలకు సూచించారు. మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మరో లక్ష మందిని సమీకరించేందుకు అక్కడి నేతలను అప్రమత్తం చేశారు.
జూన్ 1న రాష్ట్రానికి రాహుల్..
జూన్ 1న రాహుల్ రానున్న నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టును ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా సోమవారం పరిశీలిం చారు. మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు.