జిల్లాల ప్రకటనతో నేతల మధ్య చిచ్చు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పా టు చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేతల మధ్య చిచ్చు పెడుతోందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్రకటనలు చేసి, తెలివిగా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. పాలేరులో కాంగ్రెస్ ఓడిపోయినా 46 వేల ఓట్లు రావడం సంతోషకరమన్నారు.
ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరు మార్చాలంటూ లౌకికతత్వానికి భంగం కలిగేలా మాట్లాడిన కేంద్రమంత్రి వీకే సింగ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. దేశానికి నెహ్రూ కుటుంబం చేసిన సేవ, దేశం కోసం వారి కుటుంబం చేసిన త్యాగాన్ని దేశమంతటా ప్రచారం చేస్తానని తెలిపారు. నెహ్రూ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామన్నారు. గతంలో క్రమశిక్షణ చర్యలకు గురైనా ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఉన్న నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని కోరారు.