సృజనతోనే రెండంకెల జాతీయోత్పత్తి!
సీఐఐ ఎగ్జిమ్ కాన్‌క్లేవ్‌లో భారత్
బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అనేక రంగాల్లో ప్రపంచానికి నేతృత్వం వహించే సామర్థ్యమున్నప్పటికీ...సంక్లిష్టమైన విధానాలు, మితిమీరిన నియంత్రణలు నిరోధకాలుగా మారుతున్నాయని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ శాఖ బుధవారం ఏర్పాటు చేసిన ‘ఎగ్జిమ్ కాన్‌క్లేవ్ 2015’ సదస్సుకు కృష్ణ ఎల్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో వ్యాపార, ఎగుమతి అవకాశాలను ఆవిష్కరించడం అన్న అంశంపై ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అవి అందిపుచ్చుకోవడం వ్యాపారవేత్తల వంతని అన్నారు.
సజ్జల్లాంటి తృణధాన్యాలు, నేరేడు పండ్ల రసాన్ని ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలుగా ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వినూత్న అంశాలను గుర్తించి, తగిన బ్రాండిం గ్ చేయడం ద్వారా ఎగుమతులను పెంచుకోవచ్చునని వివరించారు. దాదాపు 90 శాతం సబ్సిడీ ఉన్న గ్రీన్‌హౌస్ వ్యవసాయాన్ని, గల్ఫ్ ప్రాంతాలకు రోజూ ఉన్న విమాన సర్వీసులను కలిపిచూస్తే ఎగుమతులకు మరో అవకాశం కనిపిస్తుందని అన్నారు. రెండంకెల స్థూల జాతీ యోత్పత్తి సాధించాలనుకుంటున్న దేశం అందుకోసం సృజనాత్మకతను ఆసరాగా చేసుకోవాలని సూచించారు. సీఐఐ లాంటి సంస్థలు సృజనను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సృజనాత్మక ఆలోచనలకు, ఉత్పత్తులకు పేటెంట్లు సంపాదించేందుకు రూ.ఐదు కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని అన్నారు.