
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుతో బృందం సమావేశమైంది. సాగర్ చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయని సభ్యులు తెలిపారు.
సాగునీటి పంపిణీ సమర్ధవంతంగా జరుగుతున్నట్లు తాము గమనించామని చెప్పారు. ఆధునీకరణ పనులు 98 శాతం పూర్తి అయ్యాయని, మిగతా పనులు జూలై నాటికి పూర్తి అవుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆధునీకరణ పనుల కారణంగా ప్రాజెక్టు ఆయకట్టు గ్యాప్ 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్ర పరిధిలో సాగర్ కింద 6,40,814 ఎకరాల ఆయకట్టు ఉందని, ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల ఉందన్నారు.
ప్రస్తుతం ఆ ఆయకట్టూ సాగులోకి వచ్చిందని తెలిపారు. ఆధునీకరణ పనులతో సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీరు చేరే సమయం 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గిందని చెప్పారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను మంత్రి హరీశ్ కోరారు.ఈ ప్రాజెక్ట్ గురించి తాము ఇప్పటికే తెలుసుకున్నామని, త్వరలోనే సందర్శిస్తామని తెలిపారు.