ఎకో రక్షతి రక్షితః | World Environment Day special story | Sakshi
Sakshi News home page

ఎకో రక్షతి రక్షితః

Published Sun, Jun 5 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

ఎకో రక్షతి రక్షితః

ఎకో రక్షతి రక్షితః

- మార్కెట్ మంత్రం.. పర్యావరణ హితం
- నగరవాసుల్లో ‘ఆర్గానిక్’ క్రేజ్
- అన్ని రకాల ఉత్పత్తులకూ డిమాండ్
- నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

కల్తీలతో బేజారవుతున్న నగరవాసి ఇప్పుడు ‘ఆర్గానిక్’ వస్తువుల వైపు పరుగులు పెడుతున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సహజ సిద్ధమైన జీవనశైలి బాట పడుతున్నాడు. ప్రతి వస్తువు వినియోగంలోనూ ప్రకృతి జపం కన్పిస్తోంది. రసాయనాలు లేని, కల్తీ కాని సరుకులు కొనేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడడం లేదు. వినియోగదారుల ఆసక్తి మేరకు నగరంలో పర్యావరణ హిత ఉత్పత్తుల వెల్లువ  కూడా ఊపందుకుంది. మాల్స్..షాప్స్.. ఎక్కడ చూసినా  ఆర్గానిక్ వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటి కోసమే  ప్రత్యేక స్టోర్‌‌స కూడా ఉన్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో: రసాయనాలు, కృత్రిమమైనవి ఏమీ మేళవించకుండా తయారైన ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన పెరగడంతో గత నాలుగైదేళ్లుగా సిటీలో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరిగింది. ఆహారం నుంచి అలవాట్ల దాకా అన్నీ సహజంగా ఉత్పత్తి అయినవే కావాలనే ఆకాంక్ష బాగా వ్యక్తమవుతోంది. దాదాపు పదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని 24 లెటర్డ్ మంత్ర అనే ఒకే ఒక్క షాప్ ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ కేంద్రంగా ఉండగా ఇప్పుడు నగరవ్యాప్తంగా పదుల సంఖ్యలో వచ్చేశాయి. ఇక లామకాన్, అవర్ సేక్‌డ్ ్రస్పేస్, సప్తపర్ణి తదితర చోట్ల జరిగే వారాంతపు ఆర్గానిక్ బజార్లకు జనం క్యూ  కడుతున్నారు. పతంజలి, మంతెన సత్యనారాయణ రాజు, యేల్చూరి వంటి ఆరోగ్య ప్రచారకులతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక షాప్‌లు సైతం మంచి విక్రయాలు సాధిస్తున్నాయి. ఆర్గానిక్ బైట్స్ తదితర రెస్టారెంట్స్ పూర్తి స్థాయి ఆర్గానిక్ వంటకాలనే వడ్డిస్తూ ఆదరణ పొందుతున్నాయి.

వైట్‌కు గుడ్‌బై.. ‘బ్రౌన్’కు సై..
మెరుపులకు లొంగిపోతే ఆరోగ్యం పాడవుతుందని అర్థం చేసుకున్న సిటీజనులు వైట్ రైస్‌కు బైబై చెప్పేస్తున్నారు. దీంతో ముడి బియ్యానికి డిమాండ్ ఊపందుకుంది. పదేళ్లక్రితం పాలిష్ పెట్టని బియ్యం కోసం ఎక్కడో ఓ షాప్ ఉండేది. ఇప్పుడు ఈ తరహా బియ్యం విక్రయించని షాపింగ్ మాల్ అంటూ లేదు. బియ్యంతో మొదలైన బ్రౌన్ క్రేజ్ మరిన్ని ఉత్పత్తులకు విస్తరించింది. వైట్ బ్రెడ్‌కు బదులు బ్రౌన్ బ్రెడ్‌కు జై కొడుతున్నారు. ఇదే క్రమంలో తెల్ల పంచదారను పక్కనబెట్టి ‘బ్రౌన్ షుగర్’ (మత్తు పదార్థం కాదు) కావాలంటూ తీసుకుంటున్నారు. గోధుమల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుందని, డయాబెటిస్, ఒబెసిటీ తదితర దీర్ఘకాల వ్యాధులు రావని వైద్యులు చేస్తున్న ప్రచారం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. దీంతో గోధుమ గడ్డి కూడా ప్రత్యామ్నాయంగా సహజాహార ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

రేటెక్కువైనా.. రూట్ మార్చం..
చూపులకు అందంగా కనపడే వాటికన్నా ఆరోగ్యాన్ని అందించేవే మేలని నమ్ముతున్న నగరవాసులు ఎకో ఉత్పత్తులు మిగిలిన వాటికంటే ఖరీదు ఎక్కువైనా లెక్క చేయడం లేదు. ఉదాహరణకి తెల్లబియ్యం కిలో రూ.25 నుంచి మొదలై విభిన్న ధరల్లో లభిస్తుంటే.. ముడిబియ్యం ప్రారంభ ధరే రూ.50 దాకా ఉంటోంది. ఇక క్వినోవా వంటి ప్రత్యేకమైన రకమైతే కిలో రూ.1500 వరకూ పలుకుతున్నాయి. అయినా వీటికి డిమాండ్ బాగానే ఉంది. ఫ్యాబ్ ఇండి యా వంటి షోరూమ్స్ పూర్తిస్థాయిలో ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌తో తయారైన దుస్తులను విక్రయిస్తుంటే సిటీజనులు ధరించేందుకు సై అంటున్నారు. ఈ ట్రెండ్ దాదాపు అన్ని ఉత్పత్తులకూ విస్తరించే స్తూ త్వరలోనే హైదరాబాద్‌ని ఎకో ఉత్పత్తుల హబ్‌గా మార్చేసినా ఆశ్చర్యం లేదు.

బాత్‌రూమ్‌తో ‘పీచు’ చుట్టరికం
బోర్ నీటితో చేసే స్నానం మన శరీరాన్ని శుభ్రపరిచే మాటేమోగాని క్లోరిన్ పుణ్యమాని లేనిపోని చర్మవ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఇక స్నానానికి వాడే కెమికల్ ఆధారిత సబ్బులతో చర్మపు ఆరోగ్యం పాడవుతుందంటున్నారు చర్మవైద్య నిపుణులు. వట్టివేరు స్క్రబ్ వంటివాటితో రుద్దుకుంటే అది స్కిన్ లోపల ఉండే మట్టిని సైతం తొలగిస్తుందని నమ్ముతున్నారు. ఒక్క స్క్రబ్ రెండు నెలల వరకూ వాడవచ్చు. అయితే ఒకరిది మరొకరికి మార్చకూడదు. అలాగే బీరకాయ పీచు కూడా ఇప్పుడు విరివిగా వాడకంలోకి వచ్చింది. ఇవి రూ. 25 నుంచి రూ.150 దాకా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎర్రచందనం పొడితో చేసే రెడ్ శాండల్ స్క్రబ్ కేక్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

మాల్స్ కూడా వచ్చేశాయ్
సహజ ఉత్పత్తులను అక్కడొక రాక్ ఇక్కడొక రాక్ పెట్టి అమ్మే షాపింగ్ మాల్స్ ఇప్పటిదాకా చూస్తే.. ఇటీవల పూర్తిస్థాయిలో ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే విక్రయించే సికింద్రాబాద్‌లోని ‘ఎకో బాస్కెట్’ లాంటి షాపింగ్ మాల్స్ సైతం వెలుస్తుండడం సిటీలో ఈ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతోంది. ‘గత కొంత కాలంగా వ్యక్తిగతంగా ఈ తరహా ఉత్పత్తులను వినియోగిస్తున్నా. అలాగే ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌కి హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గానూ ఉన్నాను. సిటీలో వీటికి ఉన్న డిమాండ్ చూసి అనేకంటే వీటి అవసరం నగర జీవనంలో చాలా ఉందని గుర్తించే ఈ మాల్ నెలకొల్పాం’ అని చెప్పారు ఎకో బాస్కెట్ నిర్వాహకులు విజయ్. ఆయన నెలకొల్పిన మాల్ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల నుంచి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్.. అన్నీ అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement