
సీబీఐ దర్యాప్తు ఎందుకు జరపడం లేదు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ విమర్శించారు. కృష్ణా, గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కేసుల భయంతో చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కేసుల విషయంలో సీబీఐ విచారణ జరుపుతున్నారని గుర్తు చేశారు.
రుణమాఫీ కాకపోయినా చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను విమర్శించడం తప్పా మహానాడులో టీడీపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చే అంశాలపై చర్చ జరగలేదన్నారు. ప్రజల మెప్పు పొందలేమనే కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు దొంగలు టీడీపీ నేతలేనని అన్నారు. అధికార నేతల స్వలాభం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడితే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని వేణుగోపాల్ హెచ్చరించారు.