రోజా మాత్రమే అభ్యంతరంగా మాట్లాడారా..?
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె సోమవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ...ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం రోజాను సస్పెండ్ చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాల్ మనీ కేసులో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పాత్రను ప్రశ్నించినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. సభలో రోజా మాత్రమే అభ్యంతరంగా మాట్లాడారా? సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదా? అసెంబ్లీలో అభ్యంతరకరంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలుండవా అని ఈశ్వరి ప్రశ్నించారు.
ఎమ్మెల్యే నుంచి సంజాయిషీ తీసుకోకుండా సెక్షన్ 302(2) కింద మార్షల్స్తో బయటకు పంపించడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోజా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న వాటిని ప్రభుత్వం గౌరవించడం లేదని విమర్శించారు. సభలో అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన మాటలను ప్రివిలేజ్ కమిటీ ఎందుకు పట్టించుకోవడంలేదని ఈశ్వరి ప్రశ్నించారు.