నీలా రాజకీయాలు చేస్తే జగన్ ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవారు
♦ చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపాటు
♦ పక్క పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడమేనా మీ క్యారెక్టర్?
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు మాదిరిగా.. జగన్‌మోహన్‌రెడ్డి కూడా వైశ్రాయి తరహాలో రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలకు సూట్‌కేసులిచ్చుంటే తన తండ్రి చనిపోయినప్పటినుంచి ఇప్పటికే ఎన్నోసార్లు సీఎం అయిఉండేవారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాలనుకున్నారేతప్ప తప్పుడుదారిలో అధికారం చేపట్టాలని ఆయనెప్పుడూ అనుకోలేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.చంద్రబాబు, ఆయన మం త్రులు, నేతలు చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది నీతిమాలిన రాజకీయాలని దుయ్యబట్టారు.
‘నాకుండేదే క్యారెక్టర్’ అన్న సీఎం మాటలు ఎవరికైనా నవ్వు వస్తుందన్నారు. ‘రాజకీయాల్లో విలువలకోసం పాటుపడుతున్నానంటారు.. పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలపై కేసులుపెట్టి, సూట్‌కేస్‌లిచ్చి మీ పార్టీలో చేర్చుకోవడమేనా విలువలు కాపాడడమంటే?’ అని ప్రశ్నించారు. 35ఏళ్ల రాజకీయజీవితంలో తానే తప్పూ చేయలేదని సీఎం అనడంపై ఆమె మండిపడ్డారు. ‘ఆయన రాజకీయ జీవితమే తప్పుడుమార్గంలో మొదలైందని అందరికీ తెలుసు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మొదలుపెట్టిన రాజకీయం.. ఈరోజు ఆయన, ఆయన కుమారుడు కలసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేంతవరకు కొనసాగిస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. క్యారెక్టర్ అంటాడు. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేసి, అప్పుడు ఎన్టీఆర్ దగ్గరున్న ఎమ్మెల్యేల్ని, ఈరోజు జగన్ వద్దనున్న ఎమ్మెల్యేల్ని కొన్న నీతిమాలిన క్యారెక్టర్ ఆయనది’ అని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదాకానీ, రైల్వేజోన్‌కానీ సాధించలేని అసమర్థ క్యారెక్టర్.. మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల్ని మోసగించిన మోసకారి, దగాకోరు క్యారెక్టర్ ఆయనదని తూర్పారపట్టారు. ‘మా వాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ ప్రపంచంలో తెలుగువారందరి పరువును తీసిన క్యారెక్టర్ బాబుదన్నారు.
లోకేశ్ తప్పుడు ఆలోచనల్ని తుంచేయాలి
రాజకీయాలకు పట్టిన తుప్పు చంద్రబాబు అయితే, ఆయన అడుగుజాడల్లోనే వాళ్లఅబ్బాయి రాజకీయాలు ప్రారంభించారని రోజా దుయ్యబట్టారు. ‘ఇసుకమాఫియా నుంచి కల్తీమద్యం మాఫియాదాకా.. సీఎస్‌లు సంతకం పెట్టకున్నా ప్రాజెక్టు పనుల్లో వేలకోట్లు దోచుకుంటున్న విషయం.. ఆయన అనుచరులే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళల్ని వ్యభిచారంలో దించుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటానంటున్నారు. ఇంత చిన్నవయస్సులో చేసిన తప్పులు దొరకకుండా తప్పుచేయడం నేర్చుకున్నాడంటే.. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు లోకేశ్‌వల్ల పెనుముప్పు పొంచిఉంది. కాబట్టి మొగ్గలోనే ఆయన తప్పుడు ఆలోచనల్ని తుంచివేయాలని కోరుతున్నా’ అన్నారు.
రాజీనామాకు మీరు సిద్ధమేనా?
సొంత నియోజవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలేని పయ్యావుల కేశవ్ తమ పార్టీ అధినేతను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమని రోజా అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధపడితే.. వైఎస్సార్‌సీపీ తరఫున మిగిలిన ఎమ్మెల్యేలమంతా రాజీనామాకు సిద్ధమన్నారు. తన ఎమ్మెల్యేల్ని తిరిగి ప్రజా క్షేత్రంలో గెలిపించుకురాగల సత్తా జగన్‌కుందని, ఆ దమ్మూధైర్యం టీడీపీకి, చంద్రబాబుకుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పక్కపార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనేనన్నారు. తెలంగాణ టీడీపీ కేసీఆర్ పార్టీలో విలీనమయ్యాక.. ఏపీలోనూ ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్న భయంతోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తండ్రిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టి.. క్షణాల్లో జైల్లోపెట్టిన చంద్రబాబుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఆఖిలప్రియ నమస్కారం చేసిందంటే రాజకీయాల్లో ఏమి విలువలున్నట్టని ప్రశ్నించారు.