స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..! | 10-minute test that detects a stroke from a few drops of blood | Sakshi
Sakshi News home page

స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..!

Published Thu, Nov 26 2015 5:03 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..! - Sakshi

స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..!

వైద్యరంగంలో రక్త పరీక్షలు కీలకపాత్ర పోషిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, సీజనల్ వ్యాధుల లాంటి ఏ చిన్న సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్తే ముందుగా రక్త పరీక్షలు చేయించడం.. వ్యాధి నిర్ధారణ చేయడం మనకు తెలుసు. అయితే ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ లాంటి పెద్ద సమస్య అయినా ఇప్పుడు కేవలం కొన్ని చుక్కల రక్తంతో తెలుసుకోవచ్చంటున్నారు సైంటిస్టులు. పది నిమిషాల్లో స్ట్రోక్‌ను గుర్తించే 'గేమ్ ఛేంజర్' గా ఈ కొత్త టెస్టును చెబుతున్నారు.

సమస్యను త్వరగా గుర్తించగలిగితే అపాయం నుంచి ప్రాణాన్ని రక్షించడం సులభం అవుతుంది. అందుకే చవకైన, సులభంగా వ్యాధిని గుర్తించేందుకు కనిపెట్టిన ఈ కొత్త బ్లడ్ టెస్టును పరిశోధకులు 2018 లో అందుబాటులోకి తేనున్నారు. ఈ టెస్టులో ఎంజైమ్స్ పూత కలిగిన ప్లేట్లు.. స్ట్రోక్ తర్వాత రక్తంలో పెరిగే రసాయనాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని, త్వరితగతిన వైద్యం అందించగలిగితే వైకల్యాలు దరి చేరకుండా రోగులు దీర్ఘకాలం స్వతంత్రంగా బతికే అవకాశం ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.

బిగ్గెస్ట్ కిల్లర్ గా చెప్పే బ్రెయిన్ స్ట్రోక్... బ్రిటన్‌లో తీవ్రమైన వైకల్యాలకు ప్రధాన కారణమౌతోంది. దాదాపు 1.50 లక్షల మంది స్త్రీ, పురుషులు.. కండరాల బలహీనత, పెరాలసిస్ వంటి వ్యాధులతో జీవిస్తున్నారు. మెదడులో ఏర్పడే క్లాట్స్ వల్ల కలిగే స్ట్రోక్‌కు 3-4 గంటల్లోపు చికిత్స అందించగలిగితే నష్టాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మెదడులో రక్తస్రావాన్ని బట్టి స్ట్రోక్ ఎలాంటిదో గుర్తిస్తారు. అయితే ఆస్పత్రిలో స్కాన్ చేయకుండా మాత్రం చికిత్స అందించడం సాధ్యం కాదని, వ్యాధిని గుర్తించకుండా మందు వాడటం ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుందని,  అందుకే ఆ తేడాలను కీలకంగా గుర్తించి వైద్యం అందించాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు.

అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం టెస్టును కనుగొన్నారు. అంబులెన్సులో కూడా ఈ టెస్టు చేసే అవకాశం ఉండటంతో ఖర్చు తగ్గడంతో పాటు, విలువైన సమయాన్ని ఆదా చేయచ్చంటున్నారు. గతంలోనూ బ్రెయిన్ స్ట్రోక్‌ను గుర్తించే రక్తపరీక్షలు ఉన్నా, అవి గంటల కొద్దీ సమయం తీసుకోవడంతో విస్తృతంగా వినియోగంలో లేవు. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ టెస్టు.. ఆధునిక టెక్నాలజీని వినియోగించడంతో కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలు ఇస్తుందని, కొన్ని చుక్కల రక్తంతోనే సాధ్యమౌతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షతో ప్రస్తుతం మెదడు ఏదైనా కారణాల వల్ల డ్యామేజ్ అయిందా? ఇతర అనారోగ్య కారణాలున్నాయా అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చంటున్నారు.  

ఈ రక్త పరీక్ష 2018లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో ఎన్నో జీవితాలను రక్షించవచ్చని పరిశోధనలో పాల్గొన్న అలెక్స్ ట్రావిస్ చెబుతున్నారు. స్ట్రోక్‌తో బాధపడే రోగుల్లో మూడు వంతుల మంది ఇషెమిక్ స్ట్రోక్‌తో (మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్)  బాధపడుతున్నారని పరిశోధనకు నేతృత్వం వహించిన రాయ్ కోహెన్ అంటున్నారు. సరైన సమయంలో వైద్యం అందించడం వల్ల మెదడుకు నష్టం తగ్గుతుందని, అత్యవసర చికిత్ప అందించే అవకాశం ఉంటుందని స్ట్రోక్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ షామిమ్ క్వాడ్రిక్ అంటున్నారు. ఈ కొత్త రక్తపరీక్షతో స్ట్రోక్ ను తెలుసుకోవడమే కాక.. డిమెన్షియా, క్యాన్సర్ల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement