
ఉగ్రవాదుల చేతిలో 20 మంది భారతీయులు
మాలి: మాలిలో ఉగ్రవాదులు శుక్రవారం ఓ హోటల్పై దాడికి పాల్పడి బందీలుగా తీసుకున్న 170 మందిలో 20 మంది భారతీయులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. మాలి రాజధాని బమాకో లోని హోటల్ రాడిసన్ హోటల్లోకి చొరబడిన పదిమంది ఉగ్రవాదులు.. 190 గదులతో ఉన్న హోటల్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లాహో అక్బర్, దేవుడు గొప్పవాడు, ఇతర కొన్ని అరబిక్ పదాలతో గట్టిగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదులు హోటల్‌లోకి చొరబడ్డారు.
హోటల్లో మొత్తం 170 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 140 మంది టూరిస్టులు, 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరంతా కూడా దుబాయ్ కి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తూ ఆ హోటల్ లో ఉంటున్నారని తెలిసింది. మరోపక్క, బందీలుగా ఉన్న 20మంది భారతీయులు క్షేమమేనంటూ భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ హోటల్ లో బందీలుగా ఉన్న టూరిస్టులలో ఎక్కువగా అమెరికా, బ్రిటన్ దేశస్తులు ఉన్నారు. మరోపక్క, ఓ 20 మంది బందీలను ఇప్పటికే ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు మాలీ ఆర్మీ కమాండర్ తెలిపాడు. అయితే, 20మందినే ఎందుకు విడిచిపెట్టారో అసలు లోపల ఇంకెంతమంది బందీలుగా ఉన్నారో తమకు అర్థం కావడం లేదని కూడా ఆయన అన్నారు.