
31 మంది పిల్లల సజీవ దహనం
కొలంబియాలో బస్సు ప్రమాదం
బొగోటా (కొలంబియా): ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని 31 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో 25 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరంతా ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసు వారే. కొలంబియాలో ఫండాసియాన్ పట్టణంలోని ఒక చర్చిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా బస్సులో చెలరేగిన మంటలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పరారైనా తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. డ్రైవర్ బస్సులో తీసుకెళ్తున్న పెట్రోల్ క్యాన్ కారణంగానే మంటలు చెలరేగాయని గాయాలతో బయటపడినవారు చెప్పారు.