న్యూజిలాండ్లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఉత్తర తీరంలో శుక్రవారం వేకువజామున మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 గా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీచేశారు. ఈశాన్య తీరంలోని గిస్బోర్న్ సిటీ ఏరియాలో 19కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు.
దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉదయం 5గంటలకు మునుపే భూకంపం సంభవించినట్లు స్థానికుడు బిల్ మార్టిన్ చెప్పాడు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఇంట్లో వస్తువులు చిందవందరగా పడిపోయాయని తెలిపాడు. తరచుగా భూ ప్రకంపనలు రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో చుట్టుపక్కల వాళ్లు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని బిల్ మార్టిన్ వెల్లడించాడు. గత రెండు రోజులుగా న్యూజిలాండ్ లో దాదాపు 7 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి.