మద్యం మత్తులో ఎంతపని చేశాడు?
డెట్రాయిట్: తాగి వాహనం నడిపి ఓ వ్యక్తి వందలమంది తమ నివాసాలను వదిలి పారిపోయేలా చేశాడు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడమే కాకుండా ఓ ఫెన్సింగ్ గుద్దేసి అనంతరం సహజ వాయువు పైపు లైన్ ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదే వాహనం ఓ ఇంటిని కూడా ఢీకొట్టింది. ఈ ఘటన డెట్రాయిట్ లో చోటుచేసుకుంది. వేకువ జామున ఈ ఘటన సంభవించింది.
తొలుత కొద్ది పరిమాణంలో వ్యాపించిన మంటలు క్షణాల్లో పుంజుకొని ఓ భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఉలిక్కిపడిన అక్కడి వాళ్లంతా పరారయ్యారు. ఇంకొందరు తమ ఇళ్లలో గ్యాస్ లీకవుతుందా అని అనుమానపడ్డారు. కొన్ని మైళ్ల వరకు ఈ గ్యాస్ ప్రభావం చూపించింది. కాగా, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. వెనుకే మరో వాహనంలో వస్తున్న వ్యక్తి వేగంగా స్పందించి అతడిని అందులో నుంచి బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అతడికి కొంత కాలిన గాయాలు కూడా అయ్యాయని వివరించారు. ఈ పేలుడు కారణంగా అక్కడి రోడ్డు మొత్తం కూడా ధ్వంసం అయిందన్నారు.