కారు కూడా కాపీనే..
చైనా మొబైళ్ల సంగతి మనకు తెలిసిందే.. కాస్ట్‌లీ వాటికి కాపీలా ఉంటాయి. ఇప్పుడు వాళ్లు కారును కూడా కాపీ కొట్టేశారు. మోటారు రంగ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ ఇవోక్‌కు ‘హలో బ్రదర్’ను చైనాకు చెందిన చిన్నపాటి కంపెనీ ల్యాండ్ విండ్ ఈ మధ్యన దింపేసింది. గత వారం జరిగిన ఓ మోటారు షోలో ఎక్స్-7 పేరిట కొత్త వాహనాన్ని ఆవిష్కరించింది.
రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే.. ఏది అసలు.. ఏది నకలు అన్నది గుర్తించడం అసాధ్యమే. మీరు చెప్పండి. రెండింటిలో ఏది ఒరిజినలో.. కష్టమే కదూ.. ఇందులో ఎర్ర రంగుది జాగ్వార్ కంపెనీది కాగా.. పచ్చ రంగులో ఉన్నది చైనా కంపెనీది. దీనికితోడు రేటు కూడా చైనా వాళ్ల స్థాయిలోనే చీప్‌గా పెట్టేశారు.
జాగ్వార్ కంపెనీ ఇవోక్‌ను రూ.40 లక్షలకు అమ్ముతుండగా.. ల్యాండ్ విండ్ కంపెనీ ఎక్స్-7ను రూ.13.5 లక్షలకే ఇస్తామని చెబుతోంది. ఈ కాపీ కారుపై జాగ్వార్ కన్నెర్ర చేసింది. త్వరలో ల్యాండ్ విండ్ కంపెనీపై కేసు వేసేందుకు సన్నద్ధమవుతోంది.