
కొలంబో : బౌద్ధ మతస్తులు శ్రీలంకలో ప్రతియేటా జరుపుకునే ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అందంగా ముస్తాబైన ఏనుగుల కవాతు జరుగుతుండగా ఊహించని ఘటన కలకలం రేపింది. ఓ ఏనుగు ఉన్నట్టుండి రంకెలు వేసింది. జనంపైకి లగెత్తింది. ఏనుగు ఉగ్రరూపంతో పోటీలు వీక్షిస్తున్న ప్రజలు, పక్కనే ఉన్న భక్తులు బతుకుజీవుడా అని పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చేతికి చిక్కిన వారందరినీ తొండంతో, కాళ్లతో ఏనుగు చావబాదింది.
ఈ దాడిలో 18 మంది గాయపడ్డారు. ఏనుగుపై ఉన్న మావటి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజధాని కొలంబో సమీపంలోని కొటే పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలపాలైన 16 మంది డిశ్చార్జి అయ్యారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలంకలో ఏనుగులు కలిగిఉండటం సంపన్నులు గౌరవంగా భావిస్తారు. ప్రతియేట బౌద్ధాలయాల్లో వాటికి అందాల పోటీలు నిర్వహిస్తారు.
ఇదిలాఉండగా.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఇదే తరహా పోటీల్లో 70 ఏళ్ల ముసలి ఏనుగు ‘టికిరి’ని పోటీలకు దింపిన సంగతి తెలిసిందే. బొక్కల గూడులా ఉన్న దాని శరీరం కనిపించకుండా నిండుగా బట్టలతో అలంకరించారు. అయితే, ఆ గుట్టు కాస్తా బయటపడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. జంతుప్రేమికులు ఆగ్రహంతో అధికారులు చర్యలు చేపట్టారు. టికిరిని పోటీలను నుంచి తప్పించి, వైద్యం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment