రోదసిలో ఏడిస్తే.. ఇలా ఉంటుంది!
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మనుషులపై రకరకాల ప్రభావాలు పడుతుంటాయి. అందులో ఇదొకటి. మామూలుగా మనం భూమిపై ఏడిస్తే కన్నీళ్లు కిందికి రాలిపడతాయి. కానీ రోదసిలో ఏడిస్తే ఇలా ముఖం మీదే గడ్డకట్టుకుపోతాయి! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఏడుపుపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని కెనడియన్ వ్యోమగామి, ఐఎస్‌ఎస్ కమాండర్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ ఇలా ప్రదర్శించి చూపారు.
ఈ రోదసి ఏడుపును వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ‘ఏడవమని ఒకరు ఆదేశిస్తే ఎలా ఏడుస్తాం చెప్పండి?’ అంటూ క్రిస్ కంట్లో నీళ్లు పోసుకుని ఇలా కన్నీటి పరీక్ష చూపించారు. సన్నటి ట్యూబ్ కలిగిన వాటర్ ప్యాకెట్ ద్వారా నీటిని కంట్లోకి చిమ్ముకోవడంతో ఇలా నీళ్లు కిందికి రాలకుండా కంటి దగ్గరే ఉండిపోయాయి!