చైనాలో 'రెడ్ అలర్ట్'
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో అధికారులు మంగళవారం నగరంలో 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. పాఠశాలలకు సెలవులిచ్చారు. భవన నిర్మాణాలను నిలిపివేశారు. రోడ్డు పక్కన తినుబండారాలను తయారుచేసే షాపులను మూసివేశారు. ప్రజలు వీధుల్లోకి వస్తే తప్పనిసరి మాస్కులు ధరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని విదేశీ, కొన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దుచేశారు. రోడ్లపై సగానికి సగం కార్ల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలను, చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ వాహనాలను కొన్ని రోజులపాటు పూర్తిగా నిలిపివేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకొనే కుంపట్లలో బొగ్గు వినియోగాన్ని తగ్గించాల్సిందిగా ప్రజలకు సూచనలిచ్చారు.
ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కాలుష్య కణాలను భూ ఉపరితలానికి తీసుకొచ్చేందుకు భారీ వాటర్ క్యానన్ల ద్వారా ఆకాశంలోకి నీటి తుంపరులను ఎగజిమ్ముతున్నారు. కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న ప్రపంచ నగరాల్లో బీజింగ్ నగరమే మొదటి స్థానంలో ఉంది. పరిశ్రమల కాలుష్యంతోపాటు విద్యుత్ ప్లాంటుల నుంచి వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలు, ఇళ్లలో బొగ్గు వినియోగం పెరగడం తదితర కారణాల వల్ల ఈదారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని చైనా కాలుష్య నిరోధక విభాగం వెల్లడించింది.
ప్రపంచ కాలుష్య ఇండెక్స్ ప్రకారం మంగళవారం ఉదయం గాలిలో కాలుష్యం 250 ఉందని, ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం కన్నా పది ఇంతలు ఎక్కువని బీజింగ్లోని అమెరికా ఎంబసీ వర్గాలు తెలిపాయి. 2030 నాటకి ఈ కాలుష్యాన్ని సగానికి సగం తగ్గించాలన్నది చైనాకు అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన లక్ష్యమని ఆ వర్గాలు చెప్పాయి. వాటర్ క్యానన్ల వినియోగం వల్ల రెండు, మూడు రోజుల్లోనే పరిస్థితి కచ్చితంగా మెరగుపడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు తెలియజేస్తున్నారు.