రెడ్ అలర్ట్ ప్రకటించిన చైనా
బీజింగ్: చైనాను దట్టమైన పొగమంచు ఊపిరాడకుండా చేస్తుంది. అక్కడి గాలి కాలుష్య రీడింగ్‌లు ఈ ఏడాదిలో అత్యధికంగా నమోదవుతూ.. ఆరోగ్యానికి తీవ్ర అపాయం కలిగించే స్థాయిని సూచిస్తూన్నాయి. ఉత్తర చైనాలో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని 20కి పైగా నగరాల్లో రెడ్ అలర్ట్‌ను ప్రకటించగా.. 50 నగరాల్లో రెండో ప్రమాద తీవ్రత స్థాయిని తెలిపే ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు.
ముఖ్యంగా హెబీ, హినాన్ ప్రావిన్స్‌లలో కాలుష్య తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 500 మైక్రోగ్రామ్‌లకు చేరుకుంది. షిజియాజుయాంగ్‌లోని ఓ వాతావరణ కేంద్రం వద్ద 1000 మైక్రోగ్రామ్‌లు దాటిందని అధికారులు వెల్లడించారు. బీజింగ్‌లో సైతం విజిబిలిటీ 500 మీటర్ల లోపు నమోదైంది. దట్టమైన పొగమంచు మూలంగా టియాంజిన్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 131 విమానాలను అధికారులు రద్దు చేశారు.