
హెయిర్ కటింగ్ కు లక్ష రూపాయలా?
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ క్షవరం కోసం అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చు చేశారు.
జెరూసలెం: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ క్షవరం కోసం అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చు చేశారు. బట్టల ఇస్త్రీకి రూ. 15 వేలు, భోజనానికి రూ. 1.25 లక్షలు, ఫర్నీచర్ కోసం రూ. 13 లక్షలు వెచ్చించారు. ఇదంతా ఆయన సొంత సొమ్మనుకుంటే పొరబడినట్టే. ఐక్యరాజ్యసమతి సమావేశాలకు హాజరయ్యేందుకు ఆరు రోజుల పాటు న్యూయార్క్ లో ఉన్న నెతన్యాహూకు అయిన ఖర్చు రూ. 4 కోట్లు.
ఆర్టీఐ పిటిషన్ లో ఈ వివరాలు వెలుగు చూశాయి. సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది.. నెతన్యాహూ కార్యాలయం, విదేశాంగ శాఖ నుంచి ఈ వివరాలు సేకరించారు. ప్రధాని అమెరికా పర్యటన వ్యయం వివరాల గురించి గత అక్టోబర్ లో నెతన్యాహూ కార్యాలయంను కోరాగా, విదేశాంగ శాఖకు రిఫర్ చేసిందని సచార్ తెలిపారు. మూడు నెలలు వేచి చూడాలని చెప్పడంతో జెరూసలెం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.
'ఇది ప్రజాధనం.. అంటే నా డబ్బు. దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే హక్కు నాకు ఉంది. సామాన్యుల గురించి పట్టించుకోకుండా నెతన్యాహూ, ఆయన భార్య సారా విలాస జీవితం గడుపుతున్నార'ని సచార్ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు నెతన్యాహూ ప్రతినిధి నిరాకరించారు.