ఇది కూడా స్టేటస్ సింబలే..!
ఇది కూడా స్టేటస్ సింబలే..!
Published Fri, Mar 24 2017 4:21 PM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM
బోస్టన్: సొంతిల్లు, నగలు, కార్లు... ఇలా అంతస్తును, హోదాను ప్రదర్శించుకునేందుకు బోలెడన్ని ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా మరొకటి చేరింది. అదే...‘నేను చాలా బిజీ’..అని నలుగురి ముందూ చెప్పుకోవటం, అలా అందరికీ కనిపించటం అట. హార‍్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. ఎప్పుడూ హడావుడిగా, ఒకే సమయంలో ఎన్నో పనులు చేస్తున్నట్లు కనిపించటం, తను చాలా ముఖ్యమైన వ్యక్తి అని అందరికీ చూపుకోవటం ప్రస్తుతం జనానికి బాగా ఫ్యాషన్ అయిపోయిందని వారు చెబుతున్నారు. సాయంత్రం సమయాల్లో గోల్ఫ్ ఆడటం, లేదా సెలవు రోజుల్లో రిసార్టుల్లో, బీచ్‌లో సరదాగా గడపటం వంటివి ధనవంతులమని చెప్పుకోవటానికి సూచికగా తీసుకుంటున్నారట.
‘నాకంటూ జీవితం లేకుండా పోయింది’ అనో ‘అర్జంటుగా నాకు విశ్రాంతి కావాలి’ అనో అనటం కూడా హోదాను తెలుపుకునేందుకు ఇటువంటి వారు తరచుగా అంటుంటారని వారి పరిశీలనలో తేలింది. అలాగే, ఆహారాన్ని, కావల్సిన సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవటం కూడా ఇటువంటి వారికి స్టేటస్ సింబల్‌గా కనిపిస్తుంటాయి. సినిమాలు, పత్రికలు, పాపులర్ టీవీ షోలు కూడా ఎక్కువగా డబ్బున్న వారి గురించి, వారు ఎలా విలాసాల్లో మునిగి తేలుతున్నారనే విషయాలనే చూపిస్తుంటాయని పరిశోధకుల బృందంలో ఒకరైన హార‍్వర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నీరూ పహారియా అన్నారు.
నిత్యం పనుల్లో బిజీగా ఉండే వారిని చూపించటం కంటే కోటీశ్వరులు తమ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్లు టెన్నిస్, పోలో ఆడుతున్నారా? లేక సముద్ర విహారం చేస్తున్నారా? అనే విషయాలపై ఎక్కువ దృష్టిపెట్టాయని ఆమె తెలిపారు. వీరు వాడే వస్తువులు, సేవలు కూడా ఉన్నతస్థాయి వర్గానికి చెందినవిగా పరిగణిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో చేపట్టిన ఈ పరిశోధన సారాంశాన్ని కన్జ్యూమర్ రీసెర్చి పత్రిక ఇటీవల ప్రచురించింది.
Advertisement