మిచిగన్ః పసి పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చిలకపలుకులు అంటాం. అటువంటిది నిజంగా ఆ చిలకే పలికితే ఎంత అద్భుతంగా ఫీలవుతాం. దానికి వచ్చీ రాని మాటలను దాంతో మళ్ళీ మళ్ళీ చెప్పించి ఎంజాయ్ చేస్తాం. అయితే అమెరికాలోని ఓ గడసరి చిలుక.. తన పలుకులతో ఏకంగా ఓ మర్డరిస్టును గుర్తించేట్లు చేసిందట.
ఓ మహిళ తన భర్తను హత్య చేసిన కేసులో.. చంపిన వ్యక్తిని గుర్తించిన చిలుక.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా మిచిగన్ సౌండ్ లేక్ ప్రాంతంలో గత మే నెల్లో జరిగిన ఓ హత్య కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. 48 ఏళ్ళ గ్లెన్నా దురాన్ ఆమె భర్త మారిటిన్ దురాన్ ను హత్యచేసినట్లుగా నమోదైన కేసులో ఆ పెంపుడు చిలుక ప్రధాన సాక్ష్యం చెప్పింది. మారిటిన్ దురాన్ ను అతడి భార్య గ్లెన్నా దురాన్ తుపాకీతో షూట్ చేసే ముందు వారిద్దరికీ జరిగిన వాగ్వాదాన్ని ఆ చిలుక ఎంతో స్పష్టంగా చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్లెన్నా తన ఇంట్లోనే ఉన్న భర్తపై సుమారు నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు మృతుడికి తగిలిన గాయాలను బట్టి తెలియగా... మారిటిన్ మరణించిన కొద్ది రోజుల తర్వాత బయటపడ్డ ఓ వీడియో లోని చిలుక పలుకులు ఇప్పుడు కేసులో ప్రధాన సాక్ష్యాలయ్యాయి.
మారిటిన్ హ్యత్య జరిగిన రోజు గ్లెన్నాను అతడు వారిస్తున్నట్లు, అయినా పట్టించుకోకుండా షూట్ చేసినట్లు చిలుక మాటలను బట్టి అర్థమౌతోంది. అతడు మరణించినప్పటినుంచీ చిలుక నోట... పదే పదే వెలువడుతున్న మాటలను ఇప్పుడు హత్య కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఆఫ్రికన్ ప్యారెట్.. గెట్ అవుట్, వేర్ విల్ గో, డోంట్ షూట్ అంటూ మార్చి మార్చి పలకడం మారిటిన్ హత్య జరిగిన రోజు భార్యా భర్తలిద్దరి మధ్యా జరిగిన వాగ్వాదంగా విచారణలో గుర్తించే అవకాశం కనిపిస్తోంది.
చిలుక పలికన పదాలను అధ్యయనం చేసి, అనంతరం వాటిని విలువైన సాక్ష్యంగా అనుమతిస్తామని నెవాగో ప్రాంత నేర విచారణ అటార్నీ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. ఇదో ఆసక్తికరమైన, వింత విషయమని, ఇప్పుడు తమకు ఆఫ్రికన్ చిలుకల గురించి తెలుసుకునే గొప్ప అవకాశం కూడ వచ్చిందని ఆయనన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమయాల్లో చిలుక సాక్ష్యాన్ని వినియోగించడంపై కూడ పరిశీలిస్తున్నామని, చిలుకల సాక్ష్యాన్ని నమ్మడమా? వాటి మాటలను బట్టి ప్రత్యేక ఆధారాలను సేకరించడమా అన్న విషయాలను పరిశీలిస్తున్నామని రాబర్ట్.. ఓ పత్రికతో తెలిపారు.
మర్డర్ కేసులో చిలుక సాక్ష్యం!!
Published Tue, Jun 28 2016 4:29 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement
Advertisement