ఇది చైనా స్కైలాబ్‌! | Chinese Space Station Tiangong-1 Expected to Crash in the Next 24 hours | Sakshi
Sakshi News home page

ఇది చైనా స్కైలాబ్‌!

Published Mon, Apr 2 2018 3:46 AM | Last Updated on Mon, Apr 2 2018 3:46 AM

Chinese Space Station Tiangong-1 Expected to Crash in the Next 24 hours - Sakshi

బీజింగ్‌: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన, నియంత్రణలో లేని అంతరిక్ష ప్రయోగ కేంద్రమొకటి భూమిపై కూలిపోనుంది. చైనాకు చెందిన టియాంగంగ్‌–1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం సోమవారం తెల్లవారుజామున 5 గంటలలోపు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్యలో ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టియాంగంగ్‌–1ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్‌ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది.

2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్‌–1 అంతరిక్ష  కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ చెప్పింది. అయితే టియాంగంగ్‌–1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుం దనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించలేదు. యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ మాత్రం చైనా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.25 గంటలకు టియాంగంగ్‌ భూమిపై పడొచ్చని అంచనా వేస్తోంది.

యూరప్‌లోనూ కూలొచ్చు
దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ అంచనా మరోలా ఉంది. ఆ సంస్థ చెబుతున్న దాని ప్రకారమైతే భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.42 గంటల నుంచి సోమవారం ఉదయం 9.42 గంటల మధ్య టియాంగంగ్‌ భూమిపై కూలిపోవచ్చు. ఇది బ్రిటన్‌లో కూలే అవకాశం లేదనీ, అయితే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్‌ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్‌ న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చనీ వెల్లడించింది.

ఏం భయం లేదు..
అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు చెబుతున్నారు. భూ వాతావరణంలోకి అంతరిక్ష కేంద్రం ప్రవేశించగానే అందులోని ఇంధనం అంటుకొని అనేక భాగాలు ఆకాశంలోనే కాలిపోతాయని వారు వివరిస్తున్నారు. భూమికి 80 కిలో మీటర్ల దూరంలో ఉండగానే ఇది మంటల్లో చిక్కుకుని, భూమిపై చిన్న చిన్న ముక్కలు మాత్రమే తక్కువ వేగంతో పడతాయన్నారు. ‘టియాంగంగ్‌ భూమికి ఎలాంటి హానినీ కలిగించదు. విషపదార్థాలను కూడా విడుదల చేయదు’ అని చైనా సైన్యంలోని అధికారులు చెప్పారు.

టియాంగంగ్‌ గురించి ఐక్యరాజ్యసమితి సహా అన్ని సంబంధిత అంతర్జాతీయ సంస్థలకు సమాచారమిచ్చామన్నారు. ‘సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లోలాగా టియాంగంగ్‌ భూమిపైకి దూసుకొచ్చి కూలదు. ఆకాశం నుంచి ఉల్కలు రాలుతున్నట్లుగా కనిపిస్తుంది అంతే’ అని చైనా ఏజెన్సీ చెప్పింది. గత 60 ఏళ్లలో ఆరు వేలకు పైగా వస్తువులు/పరికరాలు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాయనీ, వీటి వల్ల ఎవ్వరికీ హానీ జరగలేదని యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement