
హెచ్-1బీ వీసాలకు కోత
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కోత విధించాలంటూ ఇద్దరు సెనెటర్లు బిల్లును ప్రవేశపెట్టారు.
ఏటా 15వేల వీసాలను తగ్గించాలని బిల్లు
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కోత విధించాలంటూ ఇద్దరు సెనెటర్లు బిల్లును ప్రవేశపెట్టారు. అధిక వేతనం ఉన్న వారికి ప్రాధాన్యమిచ్చి ఏటా 15 వేల వరకు వీసాలకు కోత పెట్టాలని కోరారు. డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ బిల్ నెల్సన్, రిపబ్లికన్ పార్టీ సెనెటర్ జెఫ్ సెషన్స్ దీన్ని ప్రతిపాదించారు. అమెరికా ఉద్యోగులకు బదులు తక్కువ వేతనంతో విదేశీయులను నియమించుకునే ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలను జారీచేస్తున్నారు.
పాక్‌కు ఉగ్ర సంబంధాలు..
ఉగ్ర ఘటనలు పెరిగిపోతుండటంతో అమెరికా అప్రమత్తమైంది. ఉగ్ర సంస్థలతో పాక్‌కు సంబంధాలున్నందున ఆ దేశంతో పౌర అణు ఒప్పందం చేసుకోకూడదని అమెరికా చట్టసభ సభ్యులు, నిపుణులు చెప్పారు. టెక్ కంపెనీలు ముఖ్యంగా సోషల్ మీడియాకు చెందిన ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి కంపెనీలు ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తిస్తే వాటిని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సమాచారమివ్వాలని పేర్కొంటూ ఇద్దరు సెనెటర్లు బిల్లును ప్రవేశపెట్టారు.