ఆస్ట్రేలియాలోని మేక్వయిర్ యూనివర్సిటీ ఇటీవల దీనిపై ఓ చర్చ నిర్వహించింది. ‘డెలాయిట్ ఆస్ట్రేలియా’ప్రతినిధి జులియట్ బుర్కే ఇందులో పాల్గొన్నారు. మానవ వనరులకు సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదని వివరించారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ స్కిల్స్ ఉత్పాదకతను పెంచగలవని చెబుతున్న అధ్యయనాలను ఆమె ఉటంకించారు. బృందంలో భాగమై పనిచేయగలగడం, సహానుభూతి, సృజనాత్మకతతో వ్యవహరించడం, తన ఆలోచనలు, భావాలను బలంగా వ్యక్తం చేయగలగడం వంటి నైపుణ్యాలు ఈ కృత్రిమ మేధయుగంలో చాలా ముఖ్యం కానున్నాయని వివరించారు.
కొత్త నైపుణ్యాలు అందించాలి: ఉద్యోగాల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను తట్టుకుని నిలబడేందుకు చేపట్టాల్సిన చర్యలను మేక్వయిర్ యూనివర్సిటీలో గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్ డైరెక్టర్ వైవన్ బ్రేయర్ వివరించారు. విద్యా విధానంలో కొత్త నైపుణ్యాలు అందించడం.. ఉద్యోగాలిచ్చిన పరిశ్రమలు ఇందుకు పూనుకోవాలని సూచించారు. ఉన్నత విద్యలో గత 20 ఏళ్లల్లో అంతగా మార్పులు రాకపోవడాన్ని ఈ సందర్భంగా యూనివర్సిటీ లెర్నింగ్ అండ్ టీచింగ్ విభాగం డీన్ లియోని టికిల్ వివరించారు.
మనం మారాలి..
‘టెక్నాలజీ అభివృద్ధిని మనం అడ్డుకోలేం. పని ప్రదేశాల్లోకి చొచ్చుకురాకుండా దాన్ని ఆపలేం. పని స్వభావం మారుతోంది. మారుతూనే ఉంటుంది. కాబట్టి కొనసాగుతున్న మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి’అని జీటీఎం అండ్ సేల్స్ డిజిటల్ మీడియా (దక్షిణాసియా) హెడ్ గౌరవ్ కన్వల్ చెబుతున్నారు. నవతరం నుంచి మధ్యవయస్కుల వరకు క్రమం తప్పకుండా తమ నైపుణ్యాలను సాన పెట్టుకోవాలని సూచించారు.
సృజనాత్మక సామర్థ్యాలే రక్ష..
2030నాటికి రోబోటిక్ ఆటోమేషన్ కారణంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఏడాది కిందట 46 దేశాలపై మెకన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం.. పేద దేశాల కంటే ధనిక దేశాల్లోనే ఆటోమేషన్ ఎక్కువ ప్రభావం చూపనుంది. భారత్‌లో కొత్త టెక్నాలజీల కారణంగా 9% ఉద్యోగాలకు ముప్పు ఉంది. 32 దేశాల్లో 46% ఉద్యోగాలపై యాంత్రీకరణ ప్రభావం చూపొచ్చని ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) ఈ ఏడాది జరిపిన అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధ కలిగిన యంత్రాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) చెబుతోంది. సృజనాత్మక సామర్థ్యాలున్న వారే పైచేయి సాధిస్తారని స్థూల ఆర్థిక విధానాల విభాగాధినేత ఎక్కెహర్డ్ ఎమ్‌స్ట్ వివరించారు.
కృత్రిమ మేధ ద్వారా ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల తయారీ రంగం అంతగా లాభాలు గడించబోదని అభిప్రాయపడ్డారు. నిర్మాణ, ఆరోగ్య, వ్యాపారరంగ ఉద్యోగాలపైనే ఎక్కువగా కృత్రిమ మేధ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఆ యంత్రాలతో కలసి పని చేసేందుకు ఉద్యోగులకు కొత్తరకం నైపుణ్యాలు అవసరం అవుతాయని ఎక్కెహర్డ్ చెబుతున్నారు. పెరుగుతున్న సాంకేతికత.. కార్మిక శక్తి, ఆదాయ వ్యత్యాసాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రభావంపై ఇప్పుడే అంచనా వేయడం కష్టమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కెన్ గోల్డ్‌బెర్గ్ చెబుతున్నారు. ఏఐ వల్ల పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment