డొనాల్డ్ ట్రంప్- జిన్‌పింగ్(ఫైల్ ఫొటో(ఆర్‌ఎఫ్‌ఐ))
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి ఇప్పటికే అక్కడ 1300 మంది మరణించగా.. 85 వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంటువ్యాధి తీవ్రత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరుపనున్నట్లు గురువారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు జిన్‌పింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడతానని పత్రికా సమావేశంలో తెలిపారు. చైనాలోని వుహాన్ పట్టణంలో పురుడుపోసుకున్నట్లుగా భావిస్తున్న కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా దీనిని త్వరగానే కట్టడి చేసినా.. ఇటలీ, స్పెయిన్‌లలో మాత్రం భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆ దేశాల తర్వాత అమెరికాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.(కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై ట్రంప్ విమర్శలు)
ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనాను చైనా వైరస్ అంటూ మాటల యుద్ధానికి దిగిన ట్రంప్... తాజాగా గురువారం మరోసారి అదే విషయానికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అంతేకాదు చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందన్న వార్తలపై సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా సైనికులే తమ దేశంలో కరోనాను వ్యాప్తి చేశారంటూ చైనా చేసిన వ్యాఖ్యలను తాను తిప్పికొట్టానన్నారు. వాళ్లు ఈ విషయాన్ని గట్టిగా విశ్వసిస్తే.. ఆ సంగతేంటో చూస్తానని పేర్కొన్నారు. ఏదేమైనా చైనాతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని.. కరోనా గురించి జిన్‌పింగ్‌తో చర్చిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలతో పాటు వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఇరు దేశాధినేతలు చర్చలు జరిపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.(కరోనా : చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే.. )
చదవండి: కరోనా భయం: సాయం కోరుతున్న ఉత్తర కొరియా!?
Comments
Please login to add a commentAdd a comment