
ఆ ఏడు దేశాల్లో ట్రంప్ గుబులు!
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపడుతుండటం.. నిన్నటివరకూ ప్రత్యర్థిగా ఉన్న రష్యా వంటి కొన్ని దేశాలకు సంతోషాన్నిస్తోంటే.. అమెరికాతో కలిసి నాటో రక్షణ కూటమిలో ఉన్న పలు బాల్టిక్ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. పొరుగు దేశమైన మెక్సికో, ఆర్థిక భాగస్వామి జపాన్వంటి దేశాలూ ఆందోళన చెందుతున్నాయి.
మెక్సికో: ఎన్నికల ప్రచారం నుంచే మెక్సికో మీద ట్రంప్గురిపెట్టారు. వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టేస్తానని, దానికయ్యే ఖర్చునూ ఆ దేశం నుంచి వసూలు చేస్తానని, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న కొన్ని లక్షల మంది మెక్సికన్లను తిప్పి పంపించేస్తానని ట్రంప్ పదే పదే ఉద్ఘాటించడం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు.. మెక్సికో చేసే ఎగుమతుల్లో 80 శాతం వాటా అమెరికాదే. దీంతో ట్రంప్ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందన్నఆందోళన మెక్సికోలో నెలకొంది.
జపాన్: చైనాపై ట్రంప్ ప్రకటిస్తున్న వ్యతిరేక వైఖరి.. చైనాకు సమీపంలో ఉన్న తనను ఇరుకున పెడుతుందన్న ఆందోళన జపాన్లో నెలకొంది. అమెరికా, చైనా రెండు దేశాలతోనూ జపాన్‌కు కీలకమైన ఆర్థిక సంబంధాలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే పక్షంలో.. ఈ రెండు ఆర్థిక శక్తుల పోరులో తాను చిక్కుకుపోయే పరిస్థితి వస్తుందని కలవరపడుతోంది.
జర్మనీ: యూరప్‌లో అతి ముఖ్యమైన దేశమైన జర్మనీని కూడా ట్రంప్ కలవరపాటుకు గురిచేస్తున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్లో జోక్యం చేసుకున్నందుకు రష్యా మీద యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించేలా యూరప్ దేశాలను ప్రభావితం చేసింది జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్. ఇప్పుడు రష్యాతో ట్రంప్ సహితం.. యూరప్ జర్మనీ ప్రాబల్యాన్ని తగ్గించడంతో పాటు, మెర్కెల్ వ్యతిరేకులను బలోపేతం చేస్తుందన్న ఆందోళన ఆ దేశంలో కనిపిస్తోంది.
ఫ్రాన్స్: అమెరికాలో ట్రంప్ గెలుపు ఫ్రాన్స్‌లో రాజకీయ ఆందోళనకు దారితీసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కూడా మితవాద నేషనల్ ప్రంట్ గెలిచే అవకాశం ఉందన్నది ఆ ఆందోళన. ఆ పార్టీ నేత మరైన్లె పెన్‌కు ట్రంప్ బాహాటంగా మద్దతు ప్రకటిస్తే.. ఆమె గెలుపు అవకాశాలు ఊపందుకుంటాయని ప్రత్యర్థులు కలవరపడుతున్నారు.
లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా: బాల్టిక్ దేశాలైన ఈ మూడు దేశాలకూ ఇప్పుడు ఆందోళన తీవ్రమైంది. రష్యా జాతీయుల ప్రయోజనం పేరుతో ఉక్రెయిన్ సంక్షోభంలో జోక్యం చేసుకున్న రష్యా.. రష్యా జాతీయులు గణనీయంగా ఉన్న తమ దేశాల్లో కూడా రేపు వేలు పెడుతుందన్న కలవరం లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియాలది. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సారథ్యంలో గల నాటో సైనిక కూటమిలో ఉన్నందున ఇంతకాలం కాస్త ధైర్యంగా ఉన్నాయి. ఇప్పుడు రష్యాతో స్నేహం పెంపొందించుకోవాలని ఒకవైపు, నాటో కూటమికి కాలం చెల్లిందని మరొకవైపు వ్యాఖ్యానిస్తున్న ట్రంప్ తీరు ఈ దేశాల్లో గుబులు రేకెత్తిస్తోంది. దీంతో రష్యా సరిహద్దు వెంట గోడలు కట్టేయాలని లాత్వియా, ఎస్టోనియాలు, కనీసం కంచె అన్నా వేయాలని లిథువేనియా యోచిస్తున్నాయి.
ఇండియాలో అయోమయం!
భారత్ అమెరికాల మధ్య సంబంధాలు గత రెండు దశాబ్దాలుగా బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్వల్ల ఈ సంబంధాలు ఇంకా బలపడతాయా? భారత్‌కు లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న డైలమా భారత్ నెలకొంది. ముఖ్యంగా.. హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం చేసే ప్రయత్నాలు భారత ఐటీ నిపుణులు, సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న ఆందోళన చాలా కాలంగా పెరుగుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో చూస్తే.. చైనా విషయంలో కఠినంగా మాట్లాడుతున్న ట్రంప్, తొలుత పాకిస్తాన్ విషయంలోనూ అదే స్వరం వినిపించారు. ఆ దేశానికి అందిస్తున్న సాయాన్ని పనితీరు ఆధారంగా సమీక్షించి కోత వేయాలని ఉద్ఘాటించారు. దీంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు ట్రంప్ సాయపడగలరన్న ఆశలు భారత్‌లో కలిగాయి. కానీ.. ట్రంప్ ఇటీవల పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌తో మాట్లాడటం అందుకు విరుద్ధమైన సంకేతాలనిచ్చింది. పాక్ విషయంలో ట్రంప్ కూడా పాత బాటనే పయనిస్తారా లేదా తాను అన్నట్లుగా సమీక్షిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అలాగే.. ఐక్యరాజ్యసమితిలో, భద్రతామండలిలో సమూల సంస్కరణల అమలును డిమాండ్ చేస్తున్న భారతదేశానికి.. అమెరికా రాష్ట్రం దక్షిణ కరొలినా గవర్నర్, భారత సంతతి మహిళ నిక్కీ హేలీని ఐరాసలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించడం కాస్త ఊరటనిస్తున్న అంశం.
సాక్షి నాలెడ్జ్ సెంటర్