జిగ్వింకర్: మనది ప్రజాస్వామ్య రాజ్యం. ఇక్కడ ఓ అబ్బాయి మేజర్ కావాలంటే 18 ఏళ్ల వయసు నిండాలి. చాలా దేశాల్లో ఇలా వయసును బట్టి అబ్బాయిలు, అమ్మాయిలను మేజర్, మైనర్‌లుగా నిర్ధారిస్తారు. కానీ, పశ్చిమ ఆఫ్ర్రికాలోని సెనగల్ దేశంలోని జిగ్వింకర్ ప్రాంతం మాత్రం అబ్బాయిలకు కఠిన పరీక్ష పెడుతోంది.
అబ్బాయి.. మగాడుగా మారాలంటే నెల రోజుల పాటు అడవిలో వనవాసం చేయాలి. దీన్ని వారు బౌకౌట్ అని పిలుస్తారు. అలా వనవాసం చేసిన వచ్చిన తర్వాతే నివాస ప్రాంతంలోకి అబ్బాయిలను తిరిగి రానిస్తారు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న అబ్బాయిల్ని వారి కుటుంబీకులే ఓ వయసు వచ్చాక అడవిలోకి పంపుతారు. కేవలం అబ్బాయిలే కాకుండా వారి తండ్రులు కూడా నెలరోజుల వనవాసానికి వెళ్తారు. అయితే, ఇలా అడవిలోకి పంపే ముందు కొన్ని ఆచారాలను వారు పాటిస్తారు.
జిగ్వింకర్ ఆచారాలకు ఆకర్షితురాలైన ఫొటోగ్రాఫర్ డయానా బగ్నోలి వారి సంప్రదాయాలను తన కెమెరాలో బంధించి ఓ డాక్యుమెంట్‌గా మార్చారు. ఇలా అబ్బాయిలను అడవిలోకి పంపడాన్ని జిగ్వింకర్‌లో ఒక్కొక్క గ్రామం ఒక్కో ఏడాది నిర్వహిస్తుంది. అడవిలోకి అబ్బాయిలను పంపే ముందు వారిని సంప్రదాయబద్దంగా అలంకరిస్తారు. తర్వాత కొందరు గ్రామస్తులు వారి శారీరక దృఢత్వాన్ని, మనోశక్తిని నిరూపించుకునేందుకు కత్తులతో శరీర భాగాలను కోసుకుంటారు. అయితే, ఇలా కత్తులతో శరీరాన్ని గాయపర్చుకునే సమయంలో వారి ఒంటిపై ఆభరణాలు అలానే ఉంటాయి. అవి వారికి రక్షణ కవచంలా పనిచేస్తాయని నమ్మకం.
గ్రామస్ధుల ప్రదర్శన అనంతరం అడవిలోకి పంపే అబ్బాయిలందరికీ గుండు చేయిస్తారు. అది మొదలు వారు తిరిగొచ్చే వరకూ స్త్రీల మొహం చూడటం, తాకడం లాంటివి చేయకూడదు. అబ్బాయిలు వెళ్లిన తర్వాత ఇంటి వద్ద ఉండే ఆడవాళ్లందరూ ఒకేచోట నివసించడం ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు అడవిలో ఉండటం వల్ల అబ్బాయిలు శక్తిమంతులు అవుతారని వారి నమ్మకం. అయితే, కొందరు అటవీ పరిస్ధితులు తట్టుకోలేక మరణిస్తారు కూడా. అడవి నుంచి తిరిగివచ్చిన వారిని ఓ గుడిసెలో ఉంచి మహిళలు ఒక్కొక్కరిగా వచ్చి చూస్తారు. ఆ తర్వాతే వారిని గ్రామంలోకి రానిస్తారు.
మగాడుగా మారాలంటే..
Published Thu, Jul 20 2017 12:22 PM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM
Advertisement
Advertisement