మంచుతుపాను: నేడు 2800 విమానాలు రద్దు
► అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను
► 19కి చేరిన మృతుల సంఖ్య
► ఎమర్జెన్సీని ప్రకటించిన పది రాష్ట్రాలు
► నేడు 2,800 విమనాలు రద్దు చేసిన అమెరికా
► నిన్న 5,100 విమాన సర్వీసులు రద్దు
వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దేశ రాజధాని వాషింగ్టన్‌లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. దీని కారణంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య19కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. నార్త్ కరోలినాలో మంచు కారణంగా కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందగా, వర్జీనియాలో ఇద్దరు, మేరీలాండ్‌లో ఒకరు, న్యూయార్క్‌లో ముగ్గురు మృతిచెందారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి.
న్యూయార్క్ గవర్నర్ ఆడ్రివ్ క్యూమో సహా ఇతర రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ నగరాల్లోని రోడ్లపైకి వాహనాలను నిషేదించారు. వాహనాలు రాకుండా న్యూజెర్సీలోని బ్రిడ్జీలు, సొరంగ మార్గాలను ఆదివారం ఉదయమే మూసివేసినట్టు మేయర్ బిల్ ది బ్లాసియో తెలిపారు. అమెరికాలో మంచు కారణంగా నిన్న(శనివారం) 5,100 విమానాలు రద్దు చేయగా, ఈ రోజు 2,800 కి పైగా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.