ఆయన భార్యకు డ్రస్సులా.. నేను డిజైన్ చేయను!
ఆయన భార్యకు డ్రస్సులా.. నేను డిజైన్ చేయను!
Published Sat, Nov 19 2016 3:47 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లందరూ ఎక్కువ అంచనాలున్న హిల్లరీ క్లింటన్‌కే డ్రస్సులు డిజైన్ చేశారు. చాలాకాలంగా ఆ దేశ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా కూడా సుప్రసిద్ధ డిజైనర్లతో డ్రస్సులు డిజైన్ చేయించుకున్నారు. కానీ, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న ప్రముఖ ఫ్రెంచి డ్రస్ డిజైనర్ సోఫీ తీలెట్ మాత్రం.. ఇప్పుడు దేశ ప్రథమ మహిళ కాబోతున్న మెలానియా ట్రంప్‌కు తాను దుస్తులు సిద్ధం చేసేది లేదని స్పష్టం చేశారు. ఆమె భర్త ట్రంప్ రాజకీయ అభిప్రాయాల కారణంగా తాను ఆమెకు డిజైన్ చేయబోనని చెప్పారు. అంతేకాదు.. ఇతర డిజైనర్లు కూడా తనలాగే ఉండాలని, మెలానియా ట్రంప్‌కు దుస్తులు డిజైన్ చేయొద్దని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరికో రహస్యంగా చెప్పడం కాకుండా.. ఓ బహిరంగ లేఖ రూపంలో విడుదల చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డోనాల్డ్ ట్రంప్ జాతివిద్వేషపూరితంగా, సెక్సిస్టు వ్యాఖ్యలు చేస్తూ.. వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగించారని, అది తనకు నచ్చలేదని ఆమె అన్నారు. అయితే తనకు మాత్రం రాజకీయాల్లో తలదూర్చే ఉద్దేశం లేదన్నారు. తమది కుటుంబ సంస్థ అని, కేవలం డబ్బుల కోసమే మాత్రం పనిచేయబోమని చెప్పారు. ఆమె లేఖకు సోషల్ మీడియాలో విపరీతంగా స్పందనలు వచ్చాయి. అయితే చాలామంది ఆమె ఆలోచనా తీరును తిట్టిపోశారు. దాదాపు గత 15 ఏళ్లుగా తీలెట్ (52) అమెరికాలో ఉంటూ పనిచేస్తున్నారు. 2009 నుంచి మిషెల్ ఒబామాకు డ్రస్సులు డిజైన్ చేస్తున్నారు.
Advertisement