వాషింగ్టన్: 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాల దరఖాస్తులను ఏప్రిల్ 2 నుంచి స్వీకరిస్తామని అమెరికా పౌర, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. అయితే 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను మాత్రం తాత్కాలికంగా నిలిపివేయనున్నామని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం పరిమితి కిందకు రాని హెచ్1బీ వీసాల దరఖాస్తులైతే ప్రీమియం ప్రాసెసింగ్ కోసం కూడా అభ్యర్థించవచ్చని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
ఒకవేళ ఎవరైనా హెచ్1బీ వీసాతోపాటు ప్రీమియం ప్రాసెసింగ్‌కూ కలిపి ఒకేసారి దరఖాస్తు చేస్తే (2019 ఆర్థిక సంవత్సరం కింద) ఆ అప్లికేషన్లను తిరస్కరిస్తామంది. ప్రీమియం ప్రాసెసింగ్‌ను సెప్టెంబరు 10న తిరిగి ప్రారంభించే అవకాశం ఉందనీ, కచ్చితంగా ఎప్పుడు ఆరంభించేదీ త్వరలో ప్రకటిస్తామని యూఎస్‌సీఐఎస్ చెప్పింది. అమెరికాలోని కంపెనీలు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించేవే ఈ హెచ్1బీ వీసాలు. భారత్, చైనా తదితర దేశాల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా హెచ్1బీపైనే అమెరికాకు వెళ్తుంటా రు. ఒకసారి వీసా పొందితే మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. వీసాను మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
ఏమిటీ ప్రీమియం ప్రాసెసింగ్?
దరఖాస్తుదారులు కొంత అధిక రుసుము చెల్లించి తమ హెచ్1బీ వీసా దరఖాస్తును వేగవతంగా పరిశీలించాల్సిందిగా యూఎస్‌సీఐఎస్‌ను కోరడమే ప్రీమియం ప్రాసెసింగ్. సాధారణంగా ప్రీమియం ప్రాసెసింగ్ కింద వచ్చిన దరఖాస్తులను యూఎస్‌సీఐఎస్ 15 రోజుల్లోపే పరిశీలించి ఆమోదించడమో, తిరస్కరించడమో చేస్తుంది. ఈసారి ప్రీమియం ప్రాసెసింగ్ లేకపోయినప్పటికీ.. వీసా దరఖాస్తులను తొందరగా పరిశీలించాల్సిందిగా అభ్యర్థులు విజ్ఞప్తి చేసే అవకాశాన్ని ఇస్తున్నామనీ, అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయని యూఎస్‌సీఐఎస్ చెప్పింది. ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం వల్ల సాధారణ హెచ్1బీ దరఖాస్తులను వేగంగా పరిశీలించే వెసులుబాటు తమకు లభిస్తుందని తెలిపింది.
పదేళ్లలో భారత్ నుంచి 22 లక్షలు
అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది. ఒక్కో ఆర్థిక సంత్సరానికి 65 వేల హెచ్1బీ వీసాలను యూఎస్‌సీఐఎస్ మంజూరు చేస్తుంది. ఇవి కాకుండా మరో 20 వేల వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివిన వారి కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో పని చేసేందుకు వచ్చే వారికి కూడా 65 వేల పరిమితితో సంబంధం లేకుండా హెచ్1బీ వీసాలు ఇస్తారు. 2007 నుంచి 2017 మధ్య హెచ్1బీ కోసం అత్యధికంగా భారత్ నుంచి ఏకంగా 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment