గ్రహాంతరవాసుల పిలుపు అందిందా?
రష్యా : గ్రహాంతర వాసుల అన్వేషణలో మానవుడు కీలకమైన అడుగు వేశాడా.. భూమికి 95 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఓ గ్రహం నుంచి బలమైన సంకేతం అందిందా.. అంటే అవుననే అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు. ఈ సంకేతాన్ని బుద్ధి జీవులు పంపిందని చెప్పలేకున్నా.. మరిన్ని పరిశోధనలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొంటున్నారు. గతేడాది రష్యాలోని జెలెన్‌చుక్ స్క్యా ప్రాంతంలో ఉన్న రతన్ 600 రేడియో టెలిస్కోప్ ఈ సంకేతాన్ని గుర్తించింది. ‘హెచ్‌డీ 164595’ పేరుతో ఉన్న ఓ గ్రహ వ్యవస్థ వైపు నుంచి ఈ సంకేతం అందిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఈ గ్రహ వ్యవస్థలో ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలున్నాయని ఇప్పటికే గుర్తించారు. సంకేతం శక్తిని బట్టి సాంకేతికంగా మనకన్నా ఎంతో ముందున్న నాగరికతకు చెందిన వారి నుంచి వెలువడి ఉండొచ్చని భావిస్తున్నారు. సైనికులు ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలో దాదాపు 11 గిగాహెడ్జ్‌ల సామర్థ్యంతో అందిన ఈ సంకేతం ఏంటి.. ఇది గ్రహాంతర వాసుల నుంచే వచ్చిందని ఎలాంటి పరిశోధనల ద్వారా నిర్ధారించుకోవచ్చనే అంశాలపై వచ్చే నెలలో మెక్సికోలో జరిగే 67వ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సమావేశాల్లో చర్చించనున్నారు.