
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఏరెనాలో ఏర్పాటుచేసిన ప్రవాస పాకిస్థానీల సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో బలూచిస్థాన్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ.. గట్టిగా నినాదాలు చేశారు. బలూచిస్థాన్‌కు విముక్తి ప్రసాదించాలని, వుయ్ వాంట్ బలూచిస్థాన్ అంటూ ఈ సమావేశంలో ఓ మూలన ఉన్న ముగ్గురు కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
వారిని అడ్డుకొని దాడి చేసేందుకు అక్కడ ఉన్న కొందరు ప్రయత్నించడంతో సమావేశంలో కొంత రభస చోటుచేసుకుంది. ముత్తహిద కస్మి మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) కార్యకర్తలు, ఇతర మైనారిటీ గ్రూపులు కూడా ఇమ్రాన్ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, పాక్ మీడియా ఈ నిరసన ప్రదర్శనల గురించి కవరేజ్ ఇవ్వకపోవడం గమనార్హం. తన పాలనలో ‘నయా పాకిస్థాన్’ను తీసుకొస్తానంటూ ఇమ్రాన్ చేసిన ప్రసంగానికి పాక్ మీడియా పెద్ద ఎత్తున ప్రచురించింది.