అఘోరాలపై చిత్రం.. ఇండో అమెరికన్ల వ్యతిరేకత
అఘోరాలపై చిత్రం.. ఇండో అమెరికన్ల వ్యతిరేకత
Published Mon, Mar 27 2017 5:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
వాషింగ్టన్: హిందూధర్మ సిద్ధాంతాన్ని వేలెత్తిచూపుతూ అంతర్జాతీయ చానెల్ సీఎన్‌ఎన్ అమెరికాలో అఘోరాలపై ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారతీయ అమెరికన్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు 600 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్ చికాగోలోని సీఎన్‌ఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రేజా అస్లాన్ అనే దర్శకుడు చిత్రించిన 'బిలీవర్' డాక్యుమెంటరీలో హిందు ధర్మశాస్త్ర గౌరవానికి భంగం కలిగేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసనకారులు చెప్పారు.
దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికాలో ప్రశాంతంగా జీవిస్తున్నారని, అస్లాన్ అనే దర్శకుడు హిందూఇజాన్ని తప్పుగా చూపుతూ ఓ డాక్యుమెంటరీ చేశారని విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా(వీహెచ్‌పీఏ) అధ్యక్షుడు శాంకాంత్ సేత్ అన్నారు. బిలీవర్‌ను ప్రసారం చేయెద్దని గతంలోనే సీఎన్‌ఎన్‌ను కోరినట్లు వెల్లడించారు. తమ మాటలు ఖాతరు చేయకుండా డాక్యుమెంటరీని ప్రసారం చేసి సీఎన్‌ఎన్ ఘోరమైన పొరబాటు చేసిందని చెప్పారు. అస్లాన్ వారణాసిలోని అఘోరాలను కలిసిన తర్వాతే ఈ డాక్యుమెంటరీని చిత్రించామని చెబుతున్నారని అన్నారు. కానీ ఆయన కలిసింది అతి కొద్దిమందినేనని చెప్పారు.
యోగా, స్పిరిచ్యూవాలిటీ లాంటి గొప్ప విద్యలను ప్రపంచానికి అందించిన హిందూఇజంపై అస్లాన్ ఇలాంటి షో ఎందుకు చేశారో తనకు అర్ధంకావడం లేదని అన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని కరపత్రాలను నిరసనకారులకు అందజేశారు. కాగా, భారతీయ అమెరికన్ల నిరసనలపై స్పందించిన దర్శకుడు అస్లాన్.. తాను చిత్రించిన డాక్యుమెంటరీ హిందూఇజంపై కాదని, అఘోరాలు వాళ్లు చేసే దారుణమైన ఆచారాల గురించని చెప్పారు. అయితే, డాక్యుమెంటరీలో కులవివక్షపై చూపిన కొన్ని దృశ్యాలు కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చని అన్నారు.
Advertisement
Advertisement