పారిస్: అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే(64) అదృశ్యమయ్యారు. సెప్టెంబర్ చివరివారంలో ఫ్రాన్స్‌లోని లియో నుంచి మాతృదేశం చైనాకు చేరుకున్న తర్వాత ఆయన జాడ తెలియరాలేదు. హాంగ్వే ఇంటర్‌పోల్ అధ్యక్ష బాధ్యతలతో పాటు చైనా ప్రజా భద్రత శాఖలో ఉపమంత్రిగా ఉన్నారు. వారం రోజులు గడిచినా హాంగ్వే జాడ తెలియకపోవడంతో ఆయన భార్య ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్ అధికారులను ఆశ్రయించింది.
అవినీతిపై యుద్ధం పేరుతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్ చేయించిన తెల్సిందే. ఈ నేపథ్యంలో మెంగ్ హాంగ్వేను అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2016లో ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవడానికి రెడ్ నోటీసును, అదృశ్యమైనవారిని గుర్తించడానికి ఇంటర్‌పోల్ యెల్లో నోటీసును జారీచేస్తుంది.
చైనా అధికారుల కస్టడీలో హాంగ్వే..
అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్(సీసీడీఐ) అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించింది. అవినీతికి పాల్పడటంతో పాటు చైనా, కమ్యూనిస్టు పార్టీకి అవిధేయత చూపిన కేసులను పార్టీ రహస్య విభాగమైన సీసీడీఐ విచారిస్తుంది. లియో నుంచి చైనాలోకి అడుగుపెట్టగానే అయన్ను అవినీతి కేసులో సీసీడీఐ అదుపులోకి తీసుకుందని పేర్కొంది. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment