కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. షియా ముస్లింలు లక్ష్యంగా గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆఫ్గానిస్తాన్‌పై సోవియెట్ దాడిచేసి 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాబూల్‌లోని తయాబాన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో భవనంలో సుమారు 100 మంది ఉన్నట్లు తెలిసింది. బాధిత కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో స్థానిక ఆసుపత్రులు ప్రతిధ్వనించాయి.
తయాబాన్ కేంద్రం ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ అనే మీడియా సంస్థ ఇంతకుముందే హెచ్చరించింది. ఈ దాడి తమ పనేనని ఉగ్ర సంస్థ ఐఎస్ ప్రకటించింది. దుండగుడు ఆత్మాహుతికి పాల్పడిన తరువాత ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న సమయంలో మరో రెండు తక్కువ తీవ్రత ఉన్న బాంబులు పేలిపోవడంతో 40 మంది చనిపోయారు. మృతులు, క్షతగాత్రులను తరలించిన స్థానిక ఇస్తిక్‌లాల్ ఆసుపత్రిలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్ర గందరగోళం మధ్య తమ వారి కోసం వెతుకుతూ బాధితుల బంధువులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment