ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం రాలేదే అని బాధపడుతుంటాం.. అదే వచ్చాక అబ్బా ఏ పని చేయకున్నా జీతం వస్తే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అనుకునే ఉంటారు కదూ..! అచ్చు అలాంటి ఉద్యోగమే ఒకటి ఉంది చేస్తారా..? అయితే ఇక్కడ కాదులెండి స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ అనే పట్టణంలోని కోర్స్‌వ్యాగన్ రైల్వేస్టేషన్‌లో. మరి ఏ పనీ చేయకుండా ఉండేది ఉద్యోగం ఎలా అవుతుందనే కదా మీ అనుమానం. అదే ఇక్కడ ట్విస్టు. ఆ రైల్వే స్టేషన్‌లో ఓ గడియారం ఉంటుంది. దాని స్విచ్ ఆన్ చేస్తే ప్లాట్‌ఫాంపై ఓ లైటు వెలుగుతుంది. దీంతో అక్కడో పనిలేని పనోడు ఉద్యోగానికి వచ్చాడని తెలుస్తుందన్న మాట. మళ్లీ డ్యూటీ అయిపోయాక దాన్ని బంద్ చేస్తే చాలు. ఇదీ ఉద్యోగం. మధ్యలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. మీకిష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. ఫుల్ జీతం మాత్రం వచ్చేస్తుంది. ఇంతకీ జీతం ఎంతో తెలుసా దాదాపు రూ.1.6 లక్షలు. అంతేకాదు అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. పెన్షన్ ఇలా ఒక్కటేమిటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
కోర్స్‌వ్యాగన్ రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ఓ డిజైన్ రూపొందించాల్సిందిగా పబ్లిక్ ఆర్ట్ ఏజెన్సీ స్వీడన్, అక్కడి రవాణా శాఖ పోటీలకు పిలిచారు. ఇందుకు గెలిచిన వారికి దాదాపు రూ.5.2 కోట్లు ప్రైజ్‌మనీగా ఇస్తామని 2017లో ప్రకటించారు. దీంతో చాలా మంది పోటీపడగా.. ఆర్టిస్ట్ డుయో సైమన్, జాకబ్ సెన్నెబీలు మంచి ఐడియాలతో వచ్చి ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. అయితే ఆ డబ్బును ఒక ఉద్యోగి జీతం కోసం వాడుకోవాలని వారు సలహా ఇచ్చారు. పైగా ఆ ఉద్యోగి ఏ పని కూడా చేయకూడదని చెప్పారు. జీతంపై ఏటా 3.2 శాతం పెంచాలని కూడా నిర్ణయించారు. అయితే దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఉద్యోగం అందుబాటులోకి రావాలంటే 2026 వరకు ఆగాల్సిందే. అంతేకదా అప్పటికి కానీ ఆ రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తి కాదు.
Comments
Please login to add a commentAdd a comment