ఆ మెట్రో స్టేషన్ మళ్లీ సిద్ధమైంది!
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉగ్రమూకల దాడికి పాల్పడ్డ అనంతరం మూతపడిన రైల్వే స్టేషన్ మళ్లీ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గత నెల 22న ఉగ్రవాదులు బ్రస్సెల్స్ లోని మాల్ బీక్ మెట్రో రైల్వే స్టేషన్, జవెంటమ్ ఎయిర్ పోర్ట్, ఇతర ప్రాంతాల్లో బాంబు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ దాడులలో దాదాపు 34 మందికి పైగా మృత్యువాతపడగా, మరికొంతమంది గాయపపడ్డారు.
మాల్ బీక్ మెట్రో స్టేషన్ ను ఈ నెల 25న రీ-ఓపెన్ చేయనున్నట్లు బ్రస్సెల్స్ ఇంటర్ మునిసిపల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మెట్రో రైలు ప్రాంతంలో బాంబులు పేలడంతో స్టేషన్ తో పాటు రైలు బోగీ కొంతమేరకు ధ్వంసమవ్వడం తెలిసిందే. స్టేషన్ పరిసరాల్లో అధికారులు భద్రతను మరింత పటిష్టంచేశారు. స్థానికులు ఇప్పటికీ ఉగ్రదాడుల షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.