
బుల్లెట్ దిగింది..! 67 రోజులు బతికాడు
పాయింట్ బ్లాంక్ మీద గన్‌పెడితే అవతలి వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే గురి తప్పదు.. క్షణాల్లో తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది. ఒక్కసారి బుల్లెట్ తలలోకి వెళ్లిందంటే ఆ వ్యక్తి బతికి బట్టకడుతాడని ఎవరూ ఊహించరు. కానీ, ఓ వ్యక్తి తలలోకి బుల్లెట్ దూసెకెళ్లినా అతనికి ఏమీ కాలేదు. తలలో బుల్లెట్ దిగిన రెండునెలల తర్వాత కానీ అతను మరణించలేదు. తలలో బుల్లెట్ ఉన్నప్పటికీ ఆయన తనరోజువారీ కార్యకలాపాలలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదు. అన్ని రోజులు ఎలా బతికి ఉన్నాడో వైద్యులకు సైతం అంతుచిక్కలేదు. మరి ఆ విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందామా.....!
ఐర్లాండ్‌లో పుట్టిన కాన్ స్టాప్లెటన్ 1872లో న్యూయార్క్‌లో అడుగుపెట్టాడు. 1876లో అక్కడ మార్షల్ ఉద్యోగాన్ని సంపాదించాడు. విధి నిర్వహణలో స్టాప్లెటన్ అంకితభావంతో పనిచేసేవాడు. డేవిడ్ లంట్ స్టాప్లెటన్ ఇద్దరు మంచి స్నేహితులు. లంట్ కూడా చాలా మంచివాడని, నెమ్మదస్తుడని అందరూ అంటుండేవారు. అతిని చుట్టుపక్కలవారు లంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతుండేవారు. ఒకరోజు హత్యకేసులో నిందితుడైన హరీ విలియమ్స్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అతన్ని జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. మార్షల్ స్టాప్లెటన్ ఈ విషయాన్ని కెప్టెన్ హర్దిక్‌కు తెలియజేశాడు. అతని సాయంతో రెండురోజుల తర్వాత ఒక క్యాబిన్‌లో తలదాచుకుంటున్న విలియమ్స్‌ను స్టాప్లెటన్ అరెస్టు చేసి జైలుకు తరలించాడు.
పెనుగులాట...
కొన్ని రోజుల తర్వాత అనగా 14 జనవరి 1877న స్టాప్లెటన్, డెవిడ్ లంట్, మరికొద్ది మంది కలిసి ఒక సెలూన్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్నేహితులు అందరూ కలిసి సెలూన్‌లో కూర్చొని కూల్‌డ్రింక్‌లు తాగుతూ సంభాషించుకోవడం వారికి అలవాటే. ఇంతలోనే సెలూన్ డోర్ పగులకొట్టుకుంటూ ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. సెలూన్ లోపలికి వచ్చిన విలియవస్ సహచరుడు టామ్ స్మిత్... ఎవరైనా కదిలితే కాల్చి పడేస్తానని బెదిరించాడు.
స్టాప్టెటన్ దగ్గరికి వెళ్లిన స్మిత్ అతని నుదుటిపై రివాల్వర్‌ను పెట్టాడు. ఇది చూసిన డెవిడ్ లంట్ బిగ్గరగా అరుచుకుంటూ స్మిత్ దగ్గరికి వెళ్లి ఆపేందుకు ప్రయత్నించాడు. స్టాప్లెటన్, స్మిత్, డేవిడ్ లంట్ ముగ్గురి పెనుగులాటలో రివాల్వర్ పేలింది. ఆ రివాల్వర్ నుంచి వెళ్లిన బుల్లెట్ నేరుగా డేవిడ్ లంట్ తలలోకి వెళ్లింది. అయితే అక్కడున్నవారంతా డేవిడ్ చనిపోతాడని భావించారు. ఏకంగా తలలోకే బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడు బతకడం అసాధ్యమని అక్కడున్న వారందరూ భావించారు.
కానీ, ఆయన ఎలాంటి స్పృహ తప్పకపోవడంతో బుల్లెట్ ఆయనకు తగలలేదని అనుకున్నారు. బహుశా.. అది డేవిడ్ తలను రాసుకుంటూ ఎటోవెళ్లిపోయి ఉంటుందని, అందుకే డేవిడ్ బతికి బట్టగలిగాడని ఎవరికి వారు సమాధాన పరుచుకున్నారు. అందుకే, స్నేహితులంతా కలిసి డేవిడ్‌కు ప్రాథమిక చికిత్స చేయించారు. స్మిత్‌ను... అరెస్టుచేసి కోర్టులో హజరుపరుచారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అతన్ని కోర్టు నిందితుడిని విడుదల చేసింది.
67 రోజుల తర్వాత...
నిజానికి సెలూన్‌లో జరిగిన కాల్పుల్లో డెవిడ్ లంట్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ తగిలినా.. డెవిడ్ కుప్పకూలలేదు. తీవ్ర రక్తస్రావం జరగలేదు. కనీసం స్పృహ కూడా తప్పలేదు. చిన్నగాయం తగిలినంత నొప్పే తప్పా.. ఎలాంటి ఇబ్బంది డేవిడ్‌కు కలగలేదు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులకు కూడా డేవిడ్ తలలో బుల్లెట్ ఉందన్న అనుమానం రాలేదు. పైగా డేవిడ్ తన రోజువారీ కార్యకలాపాలకు వెళుతుండటంతో డేవిడ్‌కు కూడా ఎలాంటి సందేహం కలగలేదు. సెలూన్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత డెవిడ్‌కు తలనొప్పిరావటం మొదలైంది. చిన్నగా మొదలైన నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు తలలో బుల్లెట్ ఉందన్న విషయాన్ని గమనించారు. ఈ తీవ్రమైన తలపోటుకు బుల్లెట్టే కారణమని డాక్టర్లు ధృవీకరించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 1877 మార్చి 22న అంటే.. దాడి జరిగిన 67 రోజుల తర్వాత డేవిడ్ లంట్ ప్రాణాలు విడిచాడు.
అర ఇంచు రంధ్రం చేసిన బుల్లెట్
డెవిడ్ మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. దాడి జరిగిన రోజున ఆయన తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ పుర్రెకు అరఇంచుమేర, మెదడుకు సమీపంలో రంధ్రం చేసిందని డాక్టర్లు గుర్తించారు. దానివల్ల ఇన్‌ఫెక్షన్ మొదలై..
చీము ఏర్పడి ఆ ప్రాంతమంతా కుళ్లిపోయేలా చేసింది. దాంతో డేవిడ్ మరణించినట్లు డాక్టర్ల పరిశోధనలో తేలింది. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిన ఇన్నాళ్లు ఎలా బతికున్నాడని డాక్టర్లుకు సైతం అంతు చిక్కలేదు. ఇలా జరగడం వైద్య చరిత్రలో ఎన్నడూ లేదని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ రోజున కోర్టు విడుదల చేసిన డేవిడ్‌ను హత్యకేసులో మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ శిక్ష విధించింది.– సాక్షి స్కూల్ ఎడిషన్